న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 14,190 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో అమ్మకాలు 10,570 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 34 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు, ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో అమ్మకాలు 7.690 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 85 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లోనూ సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 22 శాతం పెరిగి 1,01,200 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ నివేదిక తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో నూతన ఇళ్ల సరఫరా (కొత్త ప్రాజెక్టులు) 17 శాతం పెరిగి 1,23,080 యూనిట్లుగా ఉంది.
పట్టణాల వారీగా..
- బెంగళూరు మార్కెట్లో 12,590 యూనిట్లు ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చినప్పుడు 60 శాతం, క్రితం త్రైమాసికంతో పోల్చిచూసినప్పుడు 86 శాతం చొప్పున పెరిగాయి.
- ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 44 శాతం అధికంగా 7,800 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- కోల్‌కతా మార్కెట్లో 3,620 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇక్కడ 43 % వృద్ధి నమోదైంది.
- అహ్మదాబాద్‌లో 31 అధికంగా 10,300 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి.
- ముంబై మార్కెట్లో 30,300 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక్కడ 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. జూన్ త్రైమాసికంతో పోల్చిచూస్తే అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నాయి.
- పుణె మార్కెట్లో 18 శాతం అధికంగా 18,560 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
- చెన్నైలో క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 12 శాతం క్షీణించి, 3,870 యూనిట్లకు పరిమితమయ్యాయి.
సానుకూల సెంటిమెంట్
‘‘టాప్8 పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. సానుకూల వినియోగ సెంటిమెంట్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తోంది’’అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ తెలిపారు. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, స్థిరమైన వడ్డీ రేట్లు కొనుగోళ్ల సెంటిమెంట్‌కు మద్దతునిచ్చే అంశాలుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment