
న్యూఢిల్లీ: భారత్ ఎన్నో నిర్మాణాత్మక, ప్రధాన ఆర్థిక సంస్కరణలు చేపట్టినందున రేటింగ్ పెంపునకు అర్హత ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ అన్నారు. వరుసగా 12వ ఏడాదీ భారత సార్వభౌమ రేటింగ్‌ను పెంచేందుకు ఫిచ్ నిరాకరిస్తూ బీబీబీను కొనసాగించిన నేపథ్యంలో గార్గ్ స్పందించారు. ఫిచ్ చర్య తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థ విషయలో ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ రుణ భారం స్థాయిపైనే తాము దృష్టి సారించినట్టు ఫిచ్ పేర్కొనట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం రేటింగ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలు, పనితీరు విషయంలో వాటికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగుతుందని గార్గ్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఐబీసీ, రెరా చట్టాలతోపాటు ఆర్థిక నేరస్థులకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని ఆయన గుర్తు చేశారు.