ఐదేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు
బెస్ట్ ప్రాక్టీస్‌లను కీర్తించిన నీతిఆయోగ్
ప్రతి జిల్లాకు రెండు చొప్పున క్లస్టర్లు
సత్వర వివాదాల పరిష్కారానికి నాలుగు ప్రాంతీయ ఫెసిలిటేషన్ సెంటర్లు
కొప్పర్తిలో రూ.250 కోట్లతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ పార్కు
కోవిడ్ సమయంలో రీస్టార్ట్ పేరుతో చేయూత
ఏపీఎంఎస్‌ఎం ఈ–వన్ పేరుతో ప్రత్యేక పోర్టల్
రూ.118 కోట్లతో ర్యాంప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం
ఇందుకోసం ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) వేగంగా విస్తరిస్తుంటే ఐదేళ్లు గాఢ నిద్రలో ఉన్న ఈనాడు రామోజీ వాటిపై విషం కక్కుతూ ఒక కథనాన్ని వండి వార్చారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ కీర్తించింది. కళ్లకు, చెవులకు గంతలు కట్టుకొని పడుకున్న రామోజీకి ఇవేవీ కనిపించలేదు.
‘‘ఐదేళ్లు నిద్దరపోయి ఐదురోజుల్లో ఉద్ధరిస్తారట!’’ అంటూ అవాస్తవ కథనాన్ని రాసేశారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను కీర్తిస్తూ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ గడిచిన ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మయోజన్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పురోగతికి తిరుపతి, విజయవాడల్లో మరో రెండు ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌వో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు.
మౌలిక వసతులకు పెద్ద పీట
ఎంఎస్‌ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది.
సుమారు రూ.531 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి, కొప్పర్తిల్లో కూడా ఎంఎస్‌ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న యూనిట్లకు అండగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లో ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది.
నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇలాంటిది విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోలు చేయాలంటూ చట్టం కూడా తీసుకు వచ్చింది.
ఏడు లక్షలు దాటిన ఎంఎస్‌ఎంఈలు
♦ గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి.
♦ ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది.
♦ గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతీ నెలా సగటున కొత్తగా 11,379 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కు చేరింది.
♦కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్‌ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్‌ఎంఈ రంగం పునర్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది.
అభివృద్ధి కోసం సర్వే చేయడం కూడా తప్పేనా రామోజీ?
వచ్చే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో రూ.118 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్‌ఫార్మెన్స్ (ర్యాంప్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఎంఎస్‌ఎంఈల వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా సేకరిస్తోంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్‌ఎంఈలను గుర్తించడం ఈ సర్వేలో ఓ భాగం. అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, బ్యాంకు రుణాలు, డిలేడ్ పేమెంట్, పోర్టల్‌కు అనుసంధానం వంటి ప్రయోజనాలను కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment