న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీ దేనిలోనూ డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజర్ హోదాలో కొనసాగకుండా సెబీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర (జెడ్‌ఈఈఎల్– జీల్ చైర్మన్), జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తమకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందన్నది వారి వాదన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ సోమవారం సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలపై తాజా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వీరు తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది.
జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment