ఐదేళ్లలో ఫార్మా వృద్ధి మూడింతలు...
న్యూఢిల్లీ: భారత ఫార్మా రంగం ఐదేళ్లలో మూడింతల వృద్ధిని సాధిస్తుందని అసోచామ్, టెక్‌సై రీసెర్చ్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. కొన్ని సమస్యలు ఉన్పప్పటికీ ప్రస్తుతం 1,800 కోట్ల డాలర్లుగా ఉన్న ప్రస్తుత భారత ఫార్మా రంగం 2020 నాటికి 5,500 కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... అమెరికా, రష్యా, ఆఫ్రికా దేశాల్లో కఠిన నిబంధనల కారణంగా ఫార్మా రంగ ఎగుమతులు వార్షికంగా 8% చొప్పున మాత్రమే చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి.
నాణ్యత గల జనరిక్ ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండటంతో అమెరికాకు మన భారత కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల ద్వారా ఆదాయం పెరుగుదలలో కరెన్సీ కదలికలు కీలకమైనవి.