
న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదన... భారత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని దేశీ ఉక్కు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత్ వాటా కేవలం రెండు శాతమేనని ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ రూర్కెలా ప్లాంటు మాజీ ఎండీ సనక్ మిశ్రా తెలిపారు. అమెరికాకు ఎగుమతి చేసే పరిమాణం తక్కువగా ఉండటం, దేశీయంగా డిమాండ్ పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సుంకాల పెంపు ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని ఆయన చెప్పారు. ‘అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత వాటా రెండు శాతమే ఉంటుంది. దేశీయంగా ఉక్కు మార్కెట్, వినియోగం భారీగా పెరుగుతోంది‘ అని మిశ్రా తెలిపారు. మరోవైపు, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలు పెంచాలన్న అమెరికా ప్రతిపాదన.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధమని ఎస్సార్ స్టీల్ డైరెక్టర్ (కమర్షియల్) హెచ్.శివరామ కృష్ణన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన పక్షంలో... అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. అయితే, భారత్‌పై పరోక్షంగా కొంత ప్రభావం పడొచ్చన్నారు. ‘అమెరికాకు యూరోపియన్ దేశాల నుంచి జరిగే ఎగుమతులపై ప్రధానంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాలకు భారత్ చేసే ఎగుమతులపైనా ఇది ప్రభావం చూపుతుంది’’ అని ఆయన చెప్పారు. అమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులపై స్వల్ప ప్రభావమే ఉంటుందని సెయిల్ మాజీ చైర్మన్ సుశీల్ కుమార్ రుంగ్టా చెప్పారు. అయితే అమెరికా నిర్ణయంతో మిగతా దేశాలు కూడా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఇది అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంలో పెను మార్పులు తీసుకురావచ్చని.. లేదా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్కు దిగుమతులపై 25%, అల్యూమినియంపై 10% సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించడం తెలిసిందే. దీనికి అధికారిక ముద్ర వేస్తూ.. వచ్చేవారం ఈ ప్రతిపాదనపై ఆయన సంతకాలు చేసే అవకాశముంది.
ఇతర దేశాలపైనే ఎక్కువ ప్రభావం: కొటక్
సుంకాల పెంపు అమలైతే... ఇతర దేశాల నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు సుమారు 9–14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ‘దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు దేశీయంగా ఉక్కు మిల్లుల సామర్థ్యాలను ప్రస్తుతమున్న 72 శాతం స్థాయి నుంచి 80– 85 శాతం స్థాయికి పెంచాలన్న అమెరికా నిర్ణయాలతో ఆ దేశానికి ఇతర దేశాల నుంచి ఉక్కు ఎగుమతులు 9– 14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చు’’ అని అంచనా వేసింది. 2017లో అమెరికా 82 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగా 36 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది. ఒకవేళ ప్లాంట్ల సామర్థ్యం మెరుగుపడి ఉక్కు ఉత్పత్తి 91–96 మిలియన్ టన్నులకు పెరిగిన పక్షంలో దిగుమతులు 22– 25 ఎంటీకి తగ్గిపోవచ్చని అంచనా. అమెరికాకు ఉక్కు ఎగుమతుల్లో కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా దేశాల వాటా దాదాపు 60 శాతం. గతేడాది భారత్ 0.9 ఎంటీ ఉక్కు మాత్రమే ఎగుమతి చేసింది. అయితే అమెరికా తీసుకునే రక్షణాత్మక చర్యల ప్రభావం ప్రపంచ ఉక్కు మార్కెట్లపై ప్రత్యక్షంగా మాత్రం తక్కువ స్థాయిలోనే ఉండవచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. మరోవైపు, సుంకాల పెంపు ప్రపంచ వాణిజ్యంతో పాటు అమెరికా ఎకానమీపైనా, అక్కడి తయారీ.. నిర్మాణ రంగాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ పేర్కొన్నారు.
ఇంకా మినహాయింపులెందుకు?: విల్బర్ రాస్
ఉక్కు, అల్యూమినియంపై దిగుమతుల సుంకాల పెంపు ప్రతిపాదనను అమెరికా సమర్థించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక దశాబ్దాలుగా చైనా, జర్మనీ వంటి దేశాలకు అన్ని రకాల మినహాయింపులిస్తూ వస్తున్న తప్పుడు విధానాలను సరిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ వ్యాఖ్యానించారు. ప్రతీకార చర్యగా యూరోపియన్ దేశాలు కూడా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచవచ్చన్న ఆందోళనలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. ‘రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆ ప్రభావాల నుంచి యూరప్, ఆసియా దేశాలకు తోడ్పాటునివ్వాలన్న సదుద్దేశంతో అప్పట్లో అన్ని రకాల మినహాయింపులు ఇచ్చేశాం. కానీ ఆయా దేశాలు ప్రస్తుతం పటిష్టంగా ఎదిగాక కూడా వాటిని కొనసాగించడం అర్ధరహితం. గతంలో చేసిన అనేక తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాస్ పేర్కొన్నారు. అటు యూరోపియన్ యూనియన్ కొంత ప్రతీకార చర్యలకూ దిగే అవకాశమూ ఉందన్నారు. అయితే, ఇది కేవలం 3 బిలియన్ డాలర్ల మేర అమెరికన్ ఉత్పత్తులకే పరిమితం కాగలదని రాస్ వ్యాఖ్యానించారు.
‘నాఫ్టా’ని సరిచేస్తే పునరాలోచిస్తా: ట్రంప్
సుంకాల విధింపు అంశం అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో (నాఫ్టా) లోపాలను సరిదిద్ది ‘సముచితమైన, కొత్త’ ఒప్పందం రూపొందిన పక్షంలో ఉక్కు, అల్యూమినియంపై ప్రతిపాదిత సుంకాల విధింపు అంశాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. ‘కెనడా, మెక్సికోతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. ప్రస్తుతం పునఃసమీక్ష జరుగుతున్నప్పటికీ.. నాఫ్తా ఒప్పందం అమెరికాకు కంపెనీలు, ఉద్యోగాలపరంగా ప్రతికూలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సముచితమైన రీతిలో కొత్తగా నాఫ్తా ఒప్పందం కుదిరిన పక్షంలో మాత్రమే సుంకాల అంశం పక్కన పెట్టే అవకాశం ఉంది‘ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment