హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటో ఎల్‌పీజీ విక్రయాలు దేశవ్యాప్తంగా అక్టోబరు–డిసెంబరులో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ కోలిషన్ (ఐఏసీ) తెలిపింది. విక్రయాలు జాతీయ స్థాయిలో 16 శాతం, తెలంగాణలో 25 శాతం వృద్ధి నమోదయ్యాయని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా చెప్పారు. ఇంధనం ధర తగ్గడమే ఇందుకు కారణమని అన్నారు. ‘ఆటో ఎల్‌పీజీ పర్యావరణానికి హాని చేయని శుద్ధ ఇంధనం. పెట్రోలుతో పోలిస్తే ధర 50 శాతం తక్కువ. ఫ్యూయెల్ ట్యాంకు కారులో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. సీఎన్‌జీ కంటే తేలికైనవి. సీఎన్‌జీ కిట్ ధర రూ.30 వేలుంటే, ఆటో ఎల్‌పీజీ కిట్ ధర రూ.20 వేలే’ అని వివరించారు. 70 దేశాల్లో 2.6 కోట్ల వాహనాలు ఆటో ఎల్‌పీజీ ఇంధనంతో నడుస్తున్నాయని ఐఏసీ ప్రెసిడెంట్ వై.కె.గుప్తా తెలిపారు.