ఆర్థిక లావాదేవీలపై ద్రవ్యోల్బణ ప్రభావం..
ఫైనాన్షియల్ బేసిక్స్..
సాధారణంగా ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా నిర్వచిస్తాం. వస్తువుల ధరల పెరుగుదలకు డిమాండ్ సప్లైలో మార్పులు రావడం, ముడిపదార్థాల విలువ పెరగడం వంటి అనేక అంశాలు కారకాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు గతేడాది ఒక వస్తువు ధర రూ.100 ఉంటే ప్రస్తుత ఏడాది అదే వస్తువు ధర రూ.106కి పెరిగింది అని అనుకుంటే.. అప్పుడు ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉన్నట్లు లెక్క.
దీన్ని బట్టి మనం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక వస్తువును కొనడానికి అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఒక వస్తువు పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి? అంటే చాలా వస్తు ధరలు పెరగొచ్చు కదా! వస్తు ధరలతో పాటు మన ఆదాయం కూడా ఒకేసారి పెరగదు. అందుకే ద్రవ్యోల్బణ పెరుగుదల కేవలం మన కొనుగోలు సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో చూస్తే.. ద్రవ్యోల్బణం మన ఆర్థిక లక్ష్యాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మన ఇన్వెస్ట్‌మెంట్లపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న మాట.
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించాలంటే..
మనం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి కోసం పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందే ద్రవ్యోల్బణం గురించి ఆలోచించాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించి ఎక్కువ రాబడిని అందించే పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల ఖర్చులు, రిటైర్మెంట్ ప్లానింగ్ సమయాల్లో ద్రవ్యోల్బణాన్ని అసలు మరువొద్దు. పదవీ విరమణ చేసిన వ్యక్తులు వివిధ మార్గాల ద్వారా సంపాదించలేరు. వారి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగితే వారి జీవనం కష్టంగా మారుతుంది.
ద్రవ్యోల్బణం పెరిగితే మనం ఖర్చు చేసే స్థాయి తగ్గుతుంది. ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించలేం. అది ఎప్పుడు పెరుగుతుందో.. తగ్గుతుందో తెలియదు. కాబట్టి దాని గురించి తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ రేటు ఏ స్థాయిలో ఉండగలదో ముందే ఊహించి దానికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోవాలి. అధిక ద్ర వ్యోల్బణ పరిస్థితుల్లో అనవసర వ్యయాలను తగ్గించుకోవాలి.