న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్ 5న పాలసీ సమీక్ష జరగనుంది కూడా. గతేడాది జూలైలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం ఒక శాతమే. అయితే నెలవారీగా చూస్తే ఐఐపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది.
మెరిసిన తయారీ, క్యాపిటల్ గూడ్స్...
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు జూలైలో భారీగా 7 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 22 సానుకూల ఫలితాలను అందించాయి. కాగా గత ఏడాది ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాత క్షీణత నమోదయింది.
కన్సూమర్ డ్యూరబుల్స్: వృద్ధి రేటు భారీగా 14.4 శాతంగా నమోదయింది. గత ఏడాది జూలైలో –2.4 శాతం క్షీణత నమోదయింది.
క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ రంగం 3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2017 జూలైలో ఈ విభాగం –1.1 శాతం క్షీణత కనిపించింది.
విద్యుత్: జూలైలో స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది.
నాలుగు నెలల్లో..: ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 1.7% నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం వృద్ధి ఈ నెలల్లో 1.2 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది.
వాణిజ్యలోటు భయాలు..
గస్టులో 17.4 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశంపై వాణిజ్యలోటు భయాలు తీవ్రమయ్యాయి. ఆగస్టులో ఏకంగా 17.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదయ్యింది. ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. 2018 ఆగస్టులో ఎగుమతులు 19.21 శాతం వృద్ధిని (2017 ఆగస్టుతో పోల్చితే) నమోదు చేసుకున్నాయి. విలువ రూపంలో ఈ ఎగుమతుల పరిమాణం 27.84 బిలియన్ డాలర్లు. అయితే దిగుమతులు కూడా భారీగా 25.41 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 45.24 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 17.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో దిగుమతుల బిల్లు భారం భారీగా పెరగడానికి అంతర్జాతీయ చమురు ధరల తీవ్రత కారణం. వాణిజ్యలోటు తీవ్రత కూడా డాలర్ మారకంలో రూపాయి విలువ 70 దిగువకు పడిపోవడానికి ప్రధాన కారణం.
7% తగ్గిన కూరగాయల ధరలు..
రిటైల్ ద్రవ్యోల్బణం 3.69%గా నమోదైంది. కూరగాయల ధరలు 7% తగ్గాయి. 6 విభాగాల్లో ఒకటైన ఆహారం పానీయాల విభాగంలో కూరగాయలతో పాటు పప్పులు (–7.76%), చక్కెర, తీపి ఉత్పత్తుల(–5.45%) తగ్గాయి. గుడ్ల ధరలు 6.96% పెరిగాయి. మాంసం, చేపలు (3.21%), పాలు, పాల ఉత్పత్తులు (2.66%), చమురు, ఫ్యాట్స్ (3.47%), పండ్లు (3.57%), ఆల్కహాలేతర పానీయాలు (1.86%) ధరలు స్వల్పంగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment