IIP statistics
-
మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరయకాంత్ యాదవ్ ప్రకారం, పురుషులు, స్త్రీల ఆయుర్దాయం 2019 సంవత్సరంలో 69.5 సంవత్సరాలు, 72 సంవత్సరాల ఉండగా.. 2020లో అది వరుసగా 67.5 సంవత్సరాలు, 69.8కి తగ్గిందని తెలిపారు. మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశవ్యాప్తంగా మరణాల నమూనాలపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని విశ్లేషించడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. 35-69 ఏళ్లలోపు పురుషులపై కోవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. కోవిడ్ కారణంగా ఈ వయస్సు వారు అధికంగా మరణించడంతో వారి ఆయుర్దాయం గణనీయంగా పడిపోయినట్లు స్టడీ తెలిపింది. (చదవండి: యూకేను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్) ఐఐపీఎస్ 145 దేశాల గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ అండ్ కోవిడ్-ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) పోర్టల్ ద్వారా సేకరించిన డేటాపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ ప్రభావం గత దశాబ్దంలో ఆయుర్దాయం వయసును పెంచడానికి మేము చేసిన కృషిని, సాధించిన పురోగతిని కోవిడ్ తుడిచిపెట్టేసింది. మహమ్మారి ఫలితంగా ప్రస్తుతం భారతదేశ ఆయుర్దాయం ఇప్పుడు 2010లో ఉన్నట్లే ఉంది. దానిని చేరుకోవడానికి మాకు సంవత్సరాలు పడుతుంది’’ అని తెలిపారు. (చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్ 90% రక్షణ) అయితే, ఆఫ్రికాతో సహా దేశాల్లో గతంలో వచ్చిన అంటువ్యాధులు ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపాయని, అయితే కొన్ని సంవత్సరాల్లో అది తిరిగి పూర్వ స్థితికి వచ్చిందని ఐఐపీఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ తెలిపారు. చదవండి: కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా? -
గణాంకాలు.. ‘బేస్ మాయ’!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం. ‘లో బేస్ రేటు ఎఫెక్ట్’ వల్ల ఐఐపీ 17.5 శాతం నుంచి 25 శాతం శ్రేణిలో ఉండవచ్చని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ సహా పలువురి అంచనాలకు అనుగుణంగానే తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. ఇక ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్ ఎఫెక్ట్’ కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2 నెలల తర్వాత పరిశ్రమలు వృద్ధిబాటకు.. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెపె్టంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచి్చంది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (-0.9 శాతం)జారిపోయింది. రెండవ నెలా ఫిబ్రవరిలోనూ మైనస్ 3.4 శాతంలో పారిశ్రామిక రంగం పడిపోయింది. అయితే బేస్ ఎఫెక్ట్ దన్నుతో మూడవ నెల– మార్చిలో భారీ వృద్ధికి జంప్ చేసింది. ఈ కారణంగానే ‘తాజా గణాంకాలను మహమ్మారి ముందు నెలలతో పోల్చి చూడడం సరికాకపోవచ్చు’ అని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ భాగంలో మార్చి వృద్ధి 25.8 శాతంగా నమోదయ్యింది. మార్చి 2020లో 22.8 శాతం ఈ విభాగం పతనమైంది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 6.1 శాతం (2020 మార్చిలో 1.3 శాతం క్షీణత) విద్యుత్: 22.5 శాతం పురోగతి (గత ఏడాది మార్చిలో 8.2 శాతం క్షీణత) క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు సంకేతమయిన ఈ విభాగం 38.3 శాతం క్షీణత (2020 మార్చి)నుంచి 41.9 శాతం వృద్ధి బాటకు మారింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఈ విభాగంలో 36.8% క్షీణత తాజా సమీక్షా నెల్లో 54.9% వృద్ధికి మారింది. మౌలిక రంగాల గ్రూప్ ఇలా...: ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్‌లో ముగిసిన 2020–21లో ఐఐపీ 8.6 శాతం క్షీణతను చవిచూసింది. ఇదీ... బేస్ ఎఫెక్ట్ ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్ప టితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 మార్చిలో 18.7% క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. అప్పటి నుంచీ 2020 ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తి మైనస్‌లోనే ఉంది. ఈ ప్రాతిపదికన ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తిలో భారీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశాలే అధికం. రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో ధరలు పెరగడం (హై బేస్) తాజా గణాంకాల్లో ‘రేటు(%) తగ్గుదల’ను సూచిస్తుందన్నది విశ్లేషణ. తగ్గిన కూరగాయల ధరలు రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఏప్రిల్‌లో 3 నెలల కనిష్టం 4.29%గా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదైంది. కూరగాయలు, తృణ ధాన్యాల వంటి నిత్యావసరాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 2.02% తగ్గి 4.87%కి దిగివచ్చింది. గణాంకాల ప్రకారం, కూరగాయల ధరలు 14.18 శాతం తగ్గాయి. చక్కెర, సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.99% తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.96% దిగివచ్చాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితుల్లో 2020 ఏప్రిల్‌లో సీపీఐ గణాంకాలు అధికారికంగా విడుదల కాలేదు. అయితే అప్పటి లాక్డౌన్ వల్ల రిటైల్ ధరలు తీవ్రంగా ఉన్నాయని అప్పటితో పోలి్చతే ఇప్పుడు ధరలు తగ్గడం (హై బేస్ వల్ల) ‘శాతాల్లో’ కొంత సానుకూలత చూపుతోందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ పేర్కొన్నారు. చదవండి: కరోనా పోరులో భారత్‌కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ -
గణాంకాలే దిక్సూచి..!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్ త్రైమాసికానికి పలు కార్పొరేట్ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యకాలంలో 2,000 కంపెనీలు క్యూ3 ఫలితాలను ప్రకటించనుండగా.. ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి అంతర్జాతీయ అంశాల పరంగా.. డిసెంబర్‌కు సంబంధించిన అమెరికా రిటైల్ అమ్మకాల డేటా ఫిబ్రవరి 14న (గురువారం) వెలువడనుంది. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, జపాన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈనెల 15న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇక దేశీ ప్రధాన అంశాల విషయానికి వస్తే.. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 13న (బుధవారం) ముగియనుంది. డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సీపీఐ డేటా ఈనెల 12న (మంగళవారం) వెలువడనుండగా.. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14న వెలువడనుంది. భౌగోళిక రాజకీయ అంశాల ప్రభావం.. అమెరికా–ఉత్తర కొరియా చర్చలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌తో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుందని, ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. అటువైపు ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అణు నిరాయుధీకరణ పరమైన ప్రకటనలు వెలువడకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించే అంశగా మారింది. యూరోజోన్ వృద్ధి మందగిస్తుందంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనేది మార్కెట్ వర్గాల మాట. కంపెనీల ఫలితాలు.. సోమవారం అమరరాజా బ్యాటరీస్, ఆంధ్రా బ్యాంక్, ఐషర్ మోటార్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇండియా సిమెంట్స్, స్పైస్‌జెట్ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం బాటా, కోల్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, హెచ్ఈజీ, హిందాల్కో, కరూర్ వైశ్యా బ్యాంక్, మన్‌పసంద్ బెవరేజెస్, ఎన్సీసీ, సన్ ఫార్మా గణాంకాలను వెల్లడించనున్నాయి. అదానీ గ్యాస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, జీవీకే పవర్, ఇన్ఫీబీమ్, ఎంటీఎన్ఎల్, నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, యునైటెడ్ బ్రూవరీస్, వోల్టాస్ ఫలితాలు ఈవారమే ఉన్నాయి. రూ.5,300 కోట్ల ఎఫ్ఐఐల పెట్టుబడి... ఫిబ్రవరి 1–8 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,273 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. మరోవైపు డెట్ మార్కెట్ నుంచి రూ.2,795 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్లో కూడా నికర అమ్మకందారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈసారి కొనుగోలుకు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం అధిక ఆర్ధిక వృద్ధి అంచనాలేనని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాంషు శ్రీవాత్సవ వివరించారు. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున వీరు వేచిచూసే వైఖరిని అవలంభించేందుకు అవకాశం ఉంది. ముడిచమురు, డాలరుతో రూపాయి కదలికలు సైతం ఎఫ్‌పీఐల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పరిశ్రమలు రయ్.. ధరల డౌన్
న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్ 5న పాలసీ సమీక్ష జరగనుంది కూడా. గతేడాది జూలైలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం ఒక శాతమే. అయితే నెలవారీగా చూస్తే ఐఐపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. మెరిసిన తయారీ, క్యాపిటల్ గూడ్స్... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు జూలైలో భారీగా 7 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 22 సానుకూల ఫలితాలను అందించాయి. కాగా గత ఏడాది ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాత క్షీణత నమోదయింది. కన్సూమర్ డ్యూరబుల్స్: వృద్ధి రేటు భారీగా 14.4 శాతంగా నమోదయింది. గత ఏడాది జూలైలో –2.4 శాతం క్షీణత నమోదయింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ రంగం 3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2017 జూలైలో ఈ విభాగం –1.1 శాతం క్షీణత కనిపించింది. విద్యుత్: జూలైలో స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. నాలుగు నెలల్లో..: ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 1.7% నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం వృద్ధి ఈ నెలల్లో 1.2 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది. వాణిజ్యలోటు భయాలు.. గస్టులో 17.4 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: దేశంపై వాణిజ్యలోటు భయాలు తీవ్రమయ్యాయి. ఆగస్టులో ఏకంగా 17.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదయ్యింది. ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. 2018 ఆగస్టులో ఎగుమతులు 19.21 శాతం వృద్ధిని (2017 ఆగస్టుతో పోల్చితే) నమోదు చేసుకున్నాయి. విలువ రూపంలో ఈ ఎగుమతుల పరిమాణం 27.84 బిలియన్ డాలర్లు. అయితే దిగుమతులు కూడా భారీగా 25.41 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 45.24 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 17.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో దిగుమతుల బిల్లు భారం భారీగా పెరగడానికి అంతర్జాతీయ చమురు ధరల తీవ్రత కారణం. వాణిజ్యలోటు తీవ్రత కూడా డాలర్ మారకంలో రూపాయి విలువ 70 దిగువకు పడిపోవడానికి ప్రధాన కారణం. 7% తగ్గిన కూరగాయల ధరలు.. రిటైల్ ద్రవ్యోల్బణం 3.69%గా నమోదైంది. కూరగాయల ధరలు 7% తగ్గాయి. 6 విభాగాల్లో ఒకటైన ఆహారం పానీయాల విభాగంలో కూరగాయలతో పాటు పప్పులు (–7.76%), చక్కెర, తీపి ఉత్పత్తుల(–5.45%) తగ్గాయి. గుడ్ల ధరలు 6.96% పెరిగాయి. మాంసం, చేపలు (3.21%), పాలు, పాల ఉత్పత్తులు (2.66%), చమురు, ఫ్యాట్స్ (3.47%), పండ్లు (3.57%), ఆల్కహాలేతర పానీయాలు (1.86%) ధరలు స్వల్పంగా పెరిగాయి. -
రికవరీ ఆశల పై నీళ్లు...!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆర్థిక రికవరీ ఆశలపై నీళ్లు చల్లాయి. 2013 డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు చూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా, క్షీణ దశ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి 2012 డిసెంబర్లో -0.6 శాతం క్షీణత నమోదుకాగా, 2013 డిసెంబర్లో కూడా ఇదే ఫలితం వెలువడింది. క్షీణత యథాపూర్వం -0.6 శాతంగా నమోదయింది. అయితే కొంతలో కొంత ఊరట అనుకుంటే క్షీణత రేటు తగ్గడం. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత -1.6 శాతం. నవంబర్‌లో -1.3 శాతం. తాజాగా ఇది మరింత తగ్గి - 0.6 శాతానికి చేరింది. ఐదు ప్రధాన రంగాల తీరు... మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. 2012 డిసెంబర్లో క్షీణత -0.8 శాతం. అదిప్పుడు ఏకంగా -1.6 శాతానికి చేరింది. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14 శాతం వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. మొత్తం వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6 శాతం నుంచి -5.3 శాతానికి చేరింది. ఇందులో మన్నికైన వస్తువుల (డ్యూరబుల్) విభాగంలో సైతం క్షీణత మరింత పెరిగింది. -8.1 శాతం నుంచి -16.2 శాతానికి చేరింది. కన్సూమర్ నాన్-డ్యూరబుల్కు వస్తే ఈ విభాగం వృద్ధిబాటకు మళ్లింది. -0.5 శాతం క్షీణత నుంచి 1.6 శాతం వృద్ధిబాటకు మళ్లింది. ఇక డిమాండ్‌కు సూచిక అయిన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత మరింత పెరిగింది. -1.1 శాతం నుంచి -3 శాతానికి పడింది. 9 నెలల్లోనూ క్షీణతే... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనూ (2013-14 మార్చి-డిసెంబర్) పారిశ్రామిక రంగం రివర్స్‌గేర్‌లోనే పయనించింది. ఉత్పాదకత క్షీణతలోనే నమోదైంది. 2012 ఏడాది ఇదే కాలంలో 0.7 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ప్రస్తుతం అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతానికి ఉత్పత్తి కుంగింది. వడ్డీ రేట్ల కోత తప్పనిసరి: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధికి ఆర్బీఐ రెపో రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తయారీ రంగం పునరుత్తేజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి. ముఖ్యంగా తాము తయారీ రంగం తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. పెట్టుబడులు, డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరమన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి నేపథ్యంలో వడ్డీరేటు తగ్గించడానికి వెసులుబాటు ఉంటుందని విశ్లేషించారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, దీనిపై వ్యయాలు తీవ్రంగా ఉండడం, రుణ సమీకరణ వ్యయాల భారం వంటి అంశాలను ప్రస్తావించారు. కాగా ద్రవ్యోల్బణం-వృద్ధి మధ్య సమతౌల్యతను సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ... వృద్ధికి ఊతం ఇవ్వడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ కోరారు.