గణాంకాలే దిక్సూచి..! | Retail inflation, IIP statistics on Tuesday | Sakshi
Sakshi News home page

గణాంకాలే దిక్సూచి..!

Published Mon, Feb 11 2019 3:50 AM | Last Updated on Mon, Feb 11 2019 3:50 AM

Retail inflation, IIP statistics on Tuesday - Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్‌ త్రైమాసికానికి పలు కార్పొరేట్‌ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యకాలంలో 2,000 కంపెనీలు క్యూ3 ఫలితాలను ప్రకటించనుండగా.. ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. 

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి 
అంతర్జాతీయ అంశాల పరంగా.. డిసెంబర్‌కు సంబంధించిన అమెరికా రిటైల్‌ అమ్మకాల డేటా ఫిబ్రవరి 14న (గురువారం) వెలువడనుంది. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, జపాన్‌ డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈనెల 15న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇక దేశీ ప్రధాన అంశాల విషయానికి వస్తే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ 13న (బుధవారం) ముగియనుంది. డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సీపీఐ డేటా ఈనెల 12న (మంగళవారం) వెలువడనుండగా.. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14న వెలువడనుంది.  

భౌగోళిక రాజకీయ అంశాల ప్రభావం.. 
అమెరికా–ఉత్తర కొరియా చర్చలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌తో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుందని, ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ.. అటువైపు ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అణు నిరాయుధీకరణ పరమైన ప్రకటనలు వెలువడకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించే అంశగా మారింది. యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుందంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనేది మార్కెట్‌ వర్గాల మాట. 

కంపెనీల ఫలితాలు.. 
సోమవారం అమరరాజా బ్యాటరీస్, ఆంధ్రా బ్యాంక్, ఐషర్‌ మోటార్స్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, ఇండియా సిమెంట్స్, స్పైస్‌జెట్‌ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం బాటా, కోల్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్, హెచ్‌ఈజీ, హిందాల్కో, కరూర్‌ వైశ్యా బ్యాంక్, మన్‌పసంద్‌ బెవరేజెస్, ఎన్‌సీసీ, సన్‌ ఫార్మా గణాంకాలను వెల్లడించనున్నాయి. అదానీ గ్యాస్, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్,   గ్లెన్‌మార్క్‌ ఫార్మా, జీవీకే పవర్, ఇన్ఫీబీమ్, ఎంటీఎన్‌ఎల్, నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, యునైటెడ్‌ బ్రూవరీస్, వోల్టాస్‌ ఫలితాలు ఈవారమే ఉన్నాయి.

రూ.5,300 కోట్ల ఎఫ్‌ఐఐల పెట్టుబడి... 
ఫిబ్రవరి 1–8 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,273 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. మరోవైపు డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.2,795 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు స్టాక్‌ మార్కెట్లో కూడా నికర అమ్మకందారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈసారి కొనుగోలుకు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం అధిక ఆర్ధిక వృద్ధి అంచనాలేనని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమాంషు శ్రీవాత్సవ వివరించారు. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున వీరు వేచిచూసే వైఖరిని అవలంభించేందుకు అవకాశం ఉంది. ముడిచమురు, డాలరుతో రూపాయి కదలికలు సైతం ఎఫ్‌పీఐల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి’  అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement