గణాంకాలు.. ‘బేస్‌ మాయ’! | Industrial Production Grows 22 4 pc In March | Sakshi
Sakshi News home page

గణాంకాలు.. ‘బేస్‌ మాయ’!

May 13 2021 7:54 AM | Updated on May 13 2021 7:54 AM

Industrial Production Grows 22 4 pc In March - Sakshi

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి  సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్‌ ఎఫెక్ట్‌ దీనికి ప్రధాన కారణం. ‘లో బేస్‌ రేటు ఎఫెక్ట్‌’ వల్ల ఐఐపీ 17.5 శాతం నుంచి 25 శాతం శ్రేణిలో ఉండవచ్చని ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అదితీ నాయర్‌ సహా పలువురి అంచనాలకు అనుగుణంగానే తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. ఇక ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది.  గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్‌ ఎఫెక్ట్‌’ కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

2 నెలల తర్వాత పరిశ్రమలు వృద్ధిబాటకు.. 
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ  దేశ వ్యాప్తంగా  కఠిన లాక్‌డౌన్‌ అమలైన సంగతి తెలిసిందే.  లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెపె్టంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్‌ కూడా కలిసి వచి్చంది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్‌లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (-0.9 శాతం)జారిపోయింది. రెండవ నెలా ఫిబ్రవరిలోనూ మైనస్‌ 3.4 శాతంలో పారిశ్రామిక రంగం పడిపోయింది. అయితే బేస్‌ ఎఫెక్ట్‌ దన్నుతో మూడవ నెల– మార్చిలో భారీ వృద్ధికి జంప్‌ చేసింది. ఈ కారణంగానే ‘తాజా గణాంకాలను మహమ్మారి ముందు నెలలతో పోల్చి చూడడం సరికాకపోవచ్చు’ అని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.  తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను పరిశీలిస్తే... 

తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ భాగంలో మార్చి వృద్ధి 25.8 శాతంగా నమోదయ్యింది.  మార్చి 2020లో 22.8 శాతం ఈ విభాగం పతనమైంది.  
మైనింగ్‌: ఈ విభాగంలో వృద్ధి 6.1 శాతం (2020 మార్చిలో 1.3 శాతం క్షీణత) 
విద్యుత్‌: 22.5 శాతం పురోగతి (గత ఏడాది మార్చిలో 8.2 శాతం క్షీణత) 
క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు సంకేతమయిన ఈ విభాగం  38.3 శాతం క్షీణత (2020 మార్చి)నుంచి 41.9 శాతం వృద్ధి బాటకు మారింది.  
కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఈ విభాగంలో 36.8% క్షీణత తాజా సమీక్షా నెల్లో 54.9% వృద్ధికి మారింది.  

మౌలిక రంగాల గ్రూప్‌ ఇలా...: ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌  2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు  భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్‌లో ముగిసిన 2020–21లో ఐఐపీ 8.6 శాతం క్షీణతను చవిచూసింది.

ఇదీ... బేస్‌ ఎఫెక్ట్‌
‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్ప టితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్‌ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 మార్చిలో  18.7% క్షీణత నమోదుకావడం (లో బేస్‌) ఇక్కడ గమనార్హం. అప్పటి నుంచీ 2020 ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తి మైనస్‌లోనే ఉంది. ఈ ప్రాతిపదికన ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తిలో భారీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశాలే అధికం. రిటైల్‌ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో ధరలు పెరగడం (హై బేస్‌) తాజా గణాంకాల్లో ‘రేటు(%) తగ్గుదల’ను సూచిస్తుందన్నది విశ్లేషణ. 

తగ్గిన కూరగాయల ధరలు
రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఏప్రిల్‌లో 3 నెలల కనిష్టం 4.29%గా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదైంది. కూరగాయలు, తృణ ధాన్యాల వంటి నిత్యావసరాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 2.02% తగ్గి 4.87%కి దిగివచ్చింది.  గణాంకాల ప్రకారం, కూరగాయల ధరలు 14.18 శాతం తగ్గాయి. చక్కెర, సంబంధిత ఉత్పత్తుల ధరలు  5.99% తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.96% దిగివచ్చాయి. కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో 2020 ఏప్రిల్‌లో సీపీఐ గణాంకాలు అధికారికంగా విడుదల కాలేదు. అయితే అప్పటి లాక్‌డౌన్‌ వల్ల రిటైల్‌ ధరలు తీవ్రంగా ఉన్నాయని అప్పటితో పోలి్చతే ఇప్పుడు ధరలు తగ్గడం (హై బేస్‌ వల్ల) ‘శాతాల్లో’ కొంత సానుకూలత చూపుతోందని ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అదితీ నాయర్‌  పేర్కొన్నారు.

చదవండి:

కరోనా పోరులో భారత్​కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement