వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టినప్పుడు ఎల్‌ఈడీ టీవీలపై పన్ను రేటు 28 శాతంగా నిర్ణయించారు. 2018లో 24, 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. జీఎస్టీ 28 శాతం ఉన్నపుడు షోరూమ్‌ల్లో 24 అంగుళాల టీవీ ధర రూ. 11 వేలుగా, 32 అంగుళాల టీవీ ధర రూ. 17,500గా ఉండేవి. జీఎస్టీ 18 శాతానికి తగ్గిన తర్వాత కూడా అవే రేట్లతో షోరూముల్లో అమ్ముతున్నారు. కంపెనీలు, షోరూమ్‌లు ఆ టీవీల బేస్ రేట్ పెంచేసి వినియోగదారుడికి దక్కాల్సిన లాభాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్‌ఐ) ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది.
సాక్షి, అమరావతి: పలు రకాల గృహ వినియోగ ఉపకరణాల్లో జీఎస్టీ రేటు తగ్గినా.. ఆ లాభం వినియోగదారుడికి చేరడంలేదు. బేస్ రేటు(మూల)లో మాయాజాలంతో కంపెనీలు, షోరూమ్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. ఈ అక్రమాలపై సమాచారంతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ డీఆర్‌ఐ డైరెక్టర్ ఎస్.నరసింహారెడ్డి ప్రత్యేక బృందాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విక్రయించే షోరూమ్‌ల్లో తనిఖీలకు ఆదేశించారు. జీఎస్టీ తగ్గిన మేరకు రాష్ట్రంలో టీవీల ధరలు తగ్గాయా లేదా అని అధికారులు పరిశీలించారు. ఆయా షోరూమ్‌ల్లో రికార్డులు పరిశీలించగా.. బేస్ ధర పెంచి అమ్మకాలు సాగిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఈ మేరకు అధికారులు పలు షోరూమ్‌లపై కేసు నమోదు చేశారు.
ఇదీ బేస్ ధర.. మోసం
సాధారణంగా ఒక వస్తువు తయారీ ఖర్చు, ఉత్పత్తిదారుని లాభం, అమ్మకందారుని లాభం కలుపుకొని బేస్ ధర నిర్ణయిస్తారు. దీనికి పన్ను జోడిస్తే ఎంఆర్‌పీ అవుతుంది. ఆ బేస్ ధరని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండా కంపెనీలు, షోరూమ్‌లు కుమ్మక్కయి బేస్ ధరను పెంచేశాయి. కేంద్రం నిర్ణయించినట్లు జీఎస్టీని తగ్గించి రశీదుల్లో చూపుతున్నాయి. బేస్ ధరను మాత్రం పెంచి పాత ధరకే విక్రయిస్తున్నాయి. దీంతో జీఎస్టీ తగ్గినా టీవీ ధర మాత్రం తగ్గడం లేదు.
టీవీల్లోనే ఏటా రూ. 80 కోట్లకు పైగా మోసం
‘కౌంటర్ పాయింట్ టీవీ ట్రాకర్ సర్వీస్’ నివేదిక ప్రకారం దేశంలో 2018 నుంచి టీవీల మార్కెట్ 15 శాతం చొప్పున పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఏడాదికి సగటున 1.50 కోట్ల టీవీ సెట్లు విక్రయిస్తున్నారు. వాటిలో సామాన్యులు కొనుగోలు చేసే 24 అంగుళాలు, 32 అంగుళాల టీవీలదే 85 శాతం వాటా. మన రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 8 లక్షల టీవీలు విక్రయిస్తున్నారని అంచనా. ఒక్కో టీవీ మీద సగటున రూ. వెయ్యి చొప్పున మోసానికి పాల్పడినా.. ఏడాదికి రూ. 80 కోట్ల వరకు దోపిడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకూ...
బేస్ రేట్ల మోసం టీవీలకే పరిమితం కాలేదు. ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకు ఈ దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ(ఎన్‌ఏఏ) దేశవ్యాప్తంగా పలు షోరూమ్‌లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు అత్యధికంగా అమ్ముడయ్యే వినియోగదార ఉత్పత్తుల (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్– ఎఫ్‌ఎంసీజీ) విక్రయాలను పరిశీలిస్తే వాటిల్లో కూడా మోసానికి పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, సూట్‌కేసులు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, డిటర్జెంట్లు, డియోడరెంట్లు, సబ్బులు, కాఫీ పౌడర్లు, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, అంబులెన్స్ ఉపకరణాలతో పాటు అపార్టుమెంట్లులో ఫ్లాట్లపై ధరల నిర్ణయంలో కూడా కంపెనీలు, షోరుమ్‌లు మోసాలకి పాల్పడుతున్నాయి. వాటిలో వివిధ వస్తువులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18, 12, 5 శాతానికి తగ్గించినా.. ఆ లాభాన్ని వినియోగదారులకు అందకుండా చేస్తున్నారు. కంపెనీలు, షోరూమ్‌ల విక్రయాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే భారీ మోసం బయటపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment