బీమా ఎంత మొత్తానికి తీసుకోవాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్
స్థూలంగా చెప్పాలంటే బీమాను ఎన్నడూ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూడొద్దు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కనక... అవసరమైనపుడు మన కుటుంబాన్ని ఆదుకోవటానికి అదొక సాధనం. అంటే రిస్క్‌ను కవర్ చేసుకునే మార్గం అన్నమాట. మనకూ కుటుంబం ఉంటుంది కనక వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసేదే ఈ కవరేజీ. బీమా పాలసీలో పలు రకాలున్నాయి. అవసరాన్ని బట్టి పాలసీ ఎంచుకోవాలి.
అయితే పాలసీని ఎంచుకున్నాక కూడా... ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే సంశయం చాలామందికి ఉంటుంది. నిజం చెప్పాలంటే దీనికి కచ్చితమైన సూత్రాలేవీ లేవు. కానీ అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలు వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని దీనిపై ఒక అంచనాకు రావాలి. అవేంటో ఒకసారి చూద్దాం.
* హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బిల్స్ తదితర రుణాల మొత్తం ఎంత ఉందో తెలుసుకోవాలి.
* మీరు మరణిస్తే... తరవాత కొన్నేళ్లపాటు మీ కుటుంబం ఎలాంటి సమస్య లేకుండా జీవించడానికి ఎంత మొత్తం అవసరమౌతుందో ఒక అంచనాకు రావాలి. అంటే నెలవారీ ఖర్చులన్నమాట.
* పిల్లల చదువు, పెళ్లిళ్లు వంటి వాటికి కావలసిన డబ్బెంతో లెక్కెయ్యండి. ఎందుకంటే మీరు మరణిస్తే వారి భవిష్యత్తు అంధకారమవ్వడం సముచితం కాదు కదా.
* పై అన్ని అంశాల్లోనూ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం మరవొద్దు. అంటే ఇప్పుడున్న ఖర్చులు మున్ముందు ఎలా ఉంటాయో ఒక అంచనాకు రావాలి.
* మీరు ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలుసుకోండి.
* చివరగా రుణాల మొత్తం, కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు వంటి వాటినన్నింటిని కలిపితే వచ్చే మొత్తంలో నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్ల మొత్తాన్ని తీసివేస్తే వచ్చే సంఖ్యకు సమానంగా బీమా తీసుకుంటే మంచిది. ఈ లెక్కలన్ని చేయడం కష్టమని భావిస్తే.. వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు బీమా తీసుకుంటే బాగుంటుంది.