ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం.. భారత్ రేటింగ్‌కు సానుకూలం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన లక్ష్యంగా... కేంద్రం-సెంట్రల్ బ్యాంక్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఫ్రేమ్‌వర్క్) భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సానుకూలమని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్ సంస్థ మూడీస్ గురువారం ప్రకటించింది. దీనివల్ల ఆర్‌బీఐ పరపతి విధాన అస్త్రాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సైతం వీలవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ విశ్లేషకులు షరీన్ మహ్మదీ పేర్కొన్నారు.
కేంద్రం-ఆర్‌బీఐ మధ్య అవగాహన ప్రకారం ఏర్పడిన కొత్త ‘ద్రవ్యోల్బణం లక్ష్యం’ యంత్రాంగం ప్రకారం, 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉండేలా చూడాలి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి చర్యలను ఆర్‌బీఐ తీసుకోవాలి.