ఇన్ఫోసిస్‌పై సెబీ కన్ను! | Infosys CEO Vishal Sikka To Address Investors Tomorrow | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌పై సెబీ కన్ను!

Published Mon, Feb 13 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

ఇన్ఫోసిస్‌పై సెబీ కన్ను!

ఇన్ఫోసిస్‌పై సెబీ కన్ను!

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ దిగజారిందన్న మూర్తి వ్యాఖ్యలతో రంగంలోకి...
పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడి
నేడు సంస్థాగత ఇన్వెస్టర్లతో సీఈఓ విశాల్‌ సిక్కా భేటీ  


న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ చిచ్చు అంతకంతకూ తీవ్రతరం అవుతోంది. వ్యవస్థాపకులు, కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు మధ్య నెలకొన్న విభేదాలు ఇన్వెస్టర్లలో కలకలం రేపుతున్నాయి. కంపెనీలో కార్పొరేట్‌ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా కీలక వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. ఇన్ఫీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ ఉదంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 టాటా గ్రూప్‌తో పాటు యునైటెడ్‌ స్పిరిట్స్, రికో ఇండియా వంటి కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు వెలుగుచూసిన తర్వాత మరో కీలక దేశీ కంపెనీలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడంతో సెబీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ‘ఇన్ఫీ పరిణామాలపై మీడియాలో వచ్చిన పలు కథనాలను పరిగణనలోకి తీసుకొని... ఇప్పటికే స్టాక్‌ ఎక్సే్ఛంజీల నుంచి వివరణ కోరాం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు దిగ్గజ కంపెనీల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిన్నింటిపైనా మేం నిశితంగా దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రయోజనాలనూ పరిరక్షించడం మా విధి’ అని సెబీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

సీఈఓ విశాల్‌ సిక్కా వేతన ప్యాకేజీని భారీగా పెంచడంతో పాటు మరో ఇద్దరు మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్దమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్‌ చేయడంపై వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కార్పొరేట్‌ ప్రమాణాలు దిగజారాయంటూ బోర్డుకు వారు లేఖ కూడా రాసినట్లు మీడియాలో గుప్పుమంది. అలాంటి లోపాలేవీ లేవని, అవన్నీ వదంతులే నంటూ సీఈఓ సిక్కా, ఇతర బోర్డు సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, నారాయణ మూర్తి స్వయంగా కార్పొరేట్‌ ప్రమాణాలు గత రెండేళ్లుగా పడిపోతూవస్తున్నాయని ఇంటర్వూ్యల్లో పేర్కొనడంతో విభేదాలు నిజమేనని తేటతెల్లమైంది. బోర్డును ప్రక్షాళన చేయాలని కూడా ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుత నాయకత్వ బృందంపై వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైంది. మరోపక్క, కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇటీవలి పరిణామాలపై(భా రీగా ప్యాకేజీలు ఇవ్వడంపట్ల) ప్రశ్నలు లేవనెత్తుండటం తెలిసిందే.

అవసరమైతే కంపెనీ నుంచి నేరుగా వివరణ...
అత్యంత ప్రొఫెషనల్‌గా నిర్వహించే కంపెనీల జాబితాలో ఉన్న ఇలాంటి కంపెనీలు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ముందుంటాయని.. ఇప్పుడు ఇలాంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోవడం వల్ల పెట్టుబడులకు సానుకూల గమ్యంగా భారత్‌ సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులు దెబ్బతింటాయని సెబీ అధికారి వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణను పరిశీలిస్తామని.. అవసరమైతే కంపెనీ నుంచే నేరుగా తాము వివరణ కోరనున్నట్లు ఆయన చెప్పారు. తాము ప్రత్యక్షంగా ఈ విషయంలో జోక్యం చేసుకునే ముందు తటస్థ అడ్వయిజరీ సంస్థలతో పాటు వివిధ సంస్థాగత ఇన్వెస్టర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

ఇన్వెస్టర్లతో సిక్కా సమావేశం నేడు...
వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య విభేదాలు బట్టబయలు అయిన నేపథ్యంలో నష్టనివారణ చర్యలపై ఇన్ఫీ సీఈఓ విశాల్‌ సిక్కా దృష్టిసారిస్తున్నారు. నేడు ముంబైలో జరగనున్న ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన సంస్థాగత ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సమాచారం. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నిర్వహిస్తున్న ‘ఛేజింగ్‌ గ్రోత్‌ కాన్ఫరెన్స్‌’లో సోమవారం సిక్కా కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఫండ్‌ మేనేజర్లకు ఇన్ఫీలో తాజా పరిణామాలను వివరించే అవకాశం ఉంది.

కాగా, ఈ సదస్సులో సిక్కా పాల్గొనడంపై చాలా రోజుల ముందే(ఇటీవల కంపెనీకి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలకు ముందే) ఖరారైందని ఇన్ఫీ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, నేడు జరిగే సమావేశంలో వ్యవస్థాపకులు, బోర్డుకు మధ్య విభేదాలే ఎక్కువగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, వ్యవస్థాపకులు లేవనెత్తిన అభ్యంతరాలపై సిక్కాతో పాటు కొందరు బోర్డు సభ్యులు సోమవారం మీడియా ముందు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇన్వెస్టర్లు నిలదీయాలి: పాయ్‌
ఇన్ఫోసిస్‌ వద్దనున్న భారీ నగదు నిల్వల సద్వినియోగం, కార్పొరేట్‌ ప్రమాణాల్లో లోపాలకు సంబంధించి సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రశ్నించాలని కంపెనీ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ‘కంపెనీలో నిధుల కేటాయింపులు చాలా ముఖ్యం. పెట్టుబడులను పరిరక్షించుకోవడం కోసం సంస్థాగత ఇన్వెస్టర్లు తప్పకుండా దీన్ని ప్రశ్నించాలి. అది వాళ్ల విధి.

 మరోపక్క, కార్పొరేట్‌ ప్రమాణాలు దిగజారడంపైనా నిలదీయాలి. ఎందుకంటే ఇది కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది’ అని పాయ్‌ పేర్కొన్నారు. 2016 డిసెంబర్‌ చివరినాటికి ఇన్ఫీ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాలంటూ పాయ్‌ ఎప్పటినుంచో సూచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇన్ఫీలో 13 శాతం మేర వాటా ఉన్న వ్యవస్థాపకులు ఇతర ఇన్వెస్టర్ల మాదిరిగానే బోర్డును ప్రశ్నించారని.. ఆ అధికారం వారికుందని పాయ్‌ వ్యాఖ్యానించారు. వారు లేవనెత్తిన అభ్యంతరాలపై బోర్డు సవివరంగా వివరణ ఇవ్వాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement