జనవరిలో 6.7% వృద్ధి
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమల విభాగం జనవరిలో పర్వాలేదనిపించింది. వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.4 శాతం. ఐఐపీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది రంగాలూ ఇలా..
►పెట్రోలియం రిఫైనరీ ప్రోడక్టులు: అసలు ఎటువంటి వృద్ధి లేని స్థితి నుంచి (2016 జనవరిలో 0%) తాజా సమీక్షా నెల– జనవరిలో 11% వృద్ధిని నమోదుచేసుకుంది.
►సిమెంట్: క్షీణత నుంచి (2016 జనవరిలో వృద్ధి లేకపోగా –13.3 శాతం క్షీణత) వృద్ధి ఏకంగా 20.7 శాతానికి ఎగసింది.
►స్టీల్: వృద్ధి 11.3 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది.
►విద్యుత్: వృద్ధి 5.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది.
►బొగ్గు: ఈ రంగంలో వృద్ధి 3.5 శాతం నుంచి 3.0 శాతానికి తగ్గింది.
►క్రూడ్ ఆయిల్: 1.3 వృద్ధి రేటు –3.2 క్షీణతలోకి జారింది.
►సహజవాయువు: ఈ రంగంలో కూడా 11.6 శాతం వృద్ధి –1 శాతం క్షీణతలోకి మారింది.
►ఎరువులు: –1.2 శాతం క్షీణత మరింతగా –1.6 క్షీణతకు జారింది.
10 నెలలూ చూస్తే దిగువ బాటే: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది.
గురితప్పింది... ద్రవ్యలోటు
జనవరి ముగిసే నాటికి 6.77 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2017–18) గురితప్పుతున్నట్లు మరింత స్పష్టమైన గణాంకాలు వెలువడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలు ఉండగానే– జనవరిలో ద్రవ్యలోటు రూ. 6.77 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2017–18 బడ్జెట్ లక్ష్యాలతో పోల్చిచూస్తే ఇది 113.7 శాతం అధికం. ప్రభుత్వ అధిక వ్యయాలు దీనికి కారణం. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2017–18లో ఈ విలువ రూ.5.33 లక్షల కోట్లు దాటరాదని ఈ బడ్జెట్ నిర్దేశించింది. ఇది మొత్తం జీడీపీ విలువతో పోల్చితే 3.2 శాతం. అయితే తాజా గణాంకాలు చూస్తుంటే, లక్ష్యాలను సాధించడంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ఇప్పటికే నిర్ధారించుకున్న కేంద్రం 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని రూ.5.95 లక్షల కోట్లకు పెంచింది. జీడీపీ అంచనా విలువలో ఇది 3.5 శాతం. మరింతగా విశ్లేషిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యానికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ద్రవ్యలోటు విధానంపై ఆర్థిక విశ్లేషకుల నుంచి విమర్శలు వెలువడ్డాయి. బడ్టెట్ తరువాత, స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి.
నెమ్మదించింది... తయారీ!
న్యూఢిల్లీ: తయారీ రంగం ఫిబ్రవరిలో నెమ్మదించిందని నికాయ్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో సూచీ 52.1గా నమోదయినట్లు తన సర్వేలో పేర్కొంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. జనవరిలో ఈ రేటు 52.4 వద్ద ఉంది. డిసెంబర్‌లో 60 నెలల గరిష్ట స్థాయి 54.7 వద్ద సూచీ ఉంది. ఫ్యాక్టరీ ఉత్పత్తి, బిజినెస్ ఆర్డర్లలో మందగమనం ఫిబ్రవరిలో సూచీ నెమ్మదించడానికి కారణమని నికాయ్ పేర్కొంది. అయితే నికాయ్ ఇండెక్స్ ప్రకారం... సూచీ 50పైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే, క్షీణతగా భావిస్తారు. వరుసగా 7 నెలలుగా సూచీ 50 పైనే ఉంటోంది.
మురిపించింది... మౌలికం
Published Thu, Mar 1 2018 12:56 AM | Last Updated on Thu, Mar 1 2018 12:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment