
బీమా డిజిటైజేషన్... కస్టమర్లకూ లాభమే
డిజిటల్ ఇండియా..! ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పదం. దేశంలోని సామాజిక మాధ్యమాలు ఈ నినాదంతో మారుమోగిపోతున్నాయి.
డిజిటల్ ఇండియా..! ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పదం. దేశంలోని సామాజిక మాధ్యమాలు ఈ నినాదంతో మారుమోగిపోతున్నాయి. ఒకప్పుడు డిజిటల్ బిజినెస్ అంటే ఈ-కామర్స్. కానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్ సైట్స్, స్మార్ట్‌ఫోన్స్, బిగ్ డాటా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి పలు కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వీటితో వినియోగదారుల ఆలోచనా సరళి మారింది.
మారుతున్న పరిస్థితులకు అనువుగా బీమా కంపెనీలు కూడా కస్టమర్లతో అనుసంధానమై ఉండటానికి, బిజినెస్ విస్తరణకు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కస్టమర్లకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది.
గతంతో పోలిస్తే ఇపుడెంతో నయం
గతంతో పోలిస్తే ప్రస్తుతం వినియోగదారులకు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఒకే ప్రోడక్ట్‌ను పలు బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. వినియోగదారులు ఒక ప్రోడక్ట్‌ను తీసుకోవాలని భావిస్తే.. వారు ముందుగా సామాజిక మాధ్యమాలను, పలు రకాల వెబ్‌సైట్స్‌ను చూసి, కావాల్సిన ప్రోడక్ట్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని, ఆ తర్వాతే కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీమా కంపెనీలన్నీ వినియోగదారులకు మరింత చేరువకావడానికి, వారి విశ్వాసాన్ని పొందటానికి డిజిటలైజేషన్ మార్గాలను అన్వేషిస్తున్నాయి. తమ ప్రోడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి.
ఇరువురికీ ప్రయోజనమే..
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వల్ల ఇటు కస్టమర్లకు, అటు కంపెనీలకు రెండింటికీ లాభమే. బీమా కంపెనీల ప్రాడక్ట్స్‌ను ఆఫ్‌లైన్‌లో కన్నా ఆన్‌లైన్‌లో కొనడం వల్ల కస్టమర్లు ముఖ్యంగా వేల్యూ యాడెడ్ లాభాలు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో బీమా కంపెనీలు కస్టమర్లకు 24/7 సేవలను అందిస్తున్నాయి. కంపెనీలకు సైతం దేశీయ, అంతర్జాతీయ కస్టమర్లను ఆకర్షించడానికి ఈ చర్య బాగా ఉపకరిస్తోంది. కస్టమర్లతో ఎప్పటికప్పుడు అనుసంధానమై వారి ప్రశ్నలను నివృత్తి చేయడానికి బీమా కంపెనీలు వీడియో చాటింగ్, వెబ్ చాట్, కో-బ్రౌజింగ్‌లను వినియోగించుకుంటున్నాయి.
కస్టమర్లు కూడా వారి అభిప్రాయాలను కంపెనీలకు తెలియజేసే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల కంపెనీలపై కస్టమర్ల విశ్వాసం మెరుగుపడే అవకాశం ఉంది. వీటన్నింటి కన్నా ముఖ్యమైన విషయం.. ఆన్‌లైన్‌లో ప్రోడక్ట్‌ను కొనుగోలు చేయడం చాలా సులభం. కస్టమర్లు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే బీమా కంపెనీల వద్ద కూడా కస్టమర్ల ప్రొఫైల్స్ ఉండటంతో అవి వారికి అనువైన ప్రోడక్ట్స్‌ను అందించడానికి వీలు కలుగుతోంది.
అందుబాటులో సమస్త సమాచారం
పాలసీ తీసుకోవాలని భావించే వారు, వారికి కావాల్సిన ప్రోడక్ట్ గురించిన నిబంధనలు, ప్రత్యేకతలు వంటి అన్ని విషయాలను ఆయా కంపెనీల వెబ్‌సైట్స్ నుంచి తెలుసుకోవచ్చు. కంపెనీల వెబ్‌సైట్స్‌లోని సమాచారం అప్‌టుడేట్‌గా ఉంటుంది. దీంతో పారదర్శకత పెరుగుతుంది. అలాగే కస్టమర్లు ప్రోడక్ట్ సంబంధిత రివ్యూలను సమీక్షించుకోవచ్చు. మరోవంక భద్రత విషయంలోనూ కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలకు, పాలసీల సమాచారానికి భద్రత కల్పించడానికి బీమా కంపెనీలు తగిన కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే టెక్నాలజీపై అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హై సెక్యూరిటీ విధానాలను అవలంబిస్తున్నాయి.
కేఎస్ గోపాలకృష్ణన్
ఎండీ, సీఈవోఎగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్