కిరాణా కొట్లో బీమా చెల్లింపులు! | Insurance payments in kirana shops | Sakshi
Sakshi News home page

కిరాణా కొట్లో బీమా చెల్లింపులు!

Published Sat, May 2 2015 12:34 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

కిరాణా కొట్లో బీమా చెల్లింపులు! - Sakshi

కిరాణా కొట్లో బీమా చెల్లింపులు!

కరెంట్, నల్లా, డీటీహెచ్ బిల్లులు కూడా
జూన్ నుంచి ఎంకియోస్క్ సేవలు అందుబాటులోకి
వినూత్న సేవలతో ముందుకొస్తున్న పే నియర్ సొల్యూషన్స్
రూ.62 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఫండ్ రెడీ
‘సాక్షి’తో పే-నియర్ సొల్యూషన్స్ సీఈఓ ప్రీతి షా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణా దుకాణమంటే ఉప్పు.. పప్పుల వంటి నిత్యావసర వస్తువులు విక్రయించేదిగానే తెలుసు. కానీ, త్వరలో ఇవి కూడా స్మార్ట్ రూపాన్ని సంతరించుకోబోతున్నాయి.

ఎంత స్మార్ట్ అంటే... ఇక్కడే బీమా పాలసీ చెల్లింపులతో పాటు కరెంట్, నల్లా బిల్లులు, డీటీహెచ్, ఇంటర్నెట్ కార్డు చెల్లింపులు కూడా చేసేయొచ్చు. ఇప్పటికే మొబైల్ అనుసంధానంతో పనిచేసే పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్... ‘ఎంపే’ను అందుబాటులోకి తెచ్చిన పే-నియర్ సొల్యూషన్స్ సంస్థ.. జూన్ మొదటి వారం నుంచి ఎం-కియోస్క్ అప్లికేషన్‌నూ మార్కెట్లోకి తెస్తోంది. దీంతో బీమా ప్రీమియం, పాలసీ క్లెయిమ్ చేయటం నుంచి వినియోగ సంబంధిత బిల్లుల వరకు అన్నింటినీ దగ్గర్లోని రిటైల్ దుకాణాల్లోనే చేసేసే వీలుందంటున్నారు పే నియర్ సీఈఓ ప్రీతి షా. ఇంకా ఆమె ఏమంటారంటే...
 
పాలసీ తీసుకోవటం వరకూ ఓకే. కానీ నెలనెలా చెల్లింపులే కష్టం. పాలసీ తేదీని గుర్తు పెట్టుకోవటం, కంపెనీలకు వెళ్లటం.. ఇదంతా కాస్త ఇబ్బందితో కూడిన పనే. ఈ చెల్లింపుల్ని ఎలాంటి చిక్కులూ లేకుండా ఇంటి పక్కనున్న రిటైల్ దుకాణాల్లోనో, మెడికల్ షాపుల్లోనో చెల్లించే వీలు కల్పిస్తుంది ఈ ఎంకియోస్క్ యాప్. ముందు దీన్ని అర్హ త గల ఏజెంట్లు, డీలర్లు కొంత మొత్తాన్ని చెల్లించి కొనుక్కోవాలి. తరవాత బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. చెల్లించాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంట ర్ చేశాక డివైజ్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కా ర్డును స్వైప్ చేస్తే చాలు.. సంబంధిత చెల్లింపులు జరిగిపోయినట్టే. ఆ లావాదేవీ వివరాలు కస్టమర్ సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అందుతాయి కూడా.
 
అన్నింటికీ సెల్‌ఫోనే..
రానురాను దేశంలో క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా తగినవిధంగా ప్రోత్సహిస్తోంది. ఈ మధ్య బ్యాంకులూ భారీగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచాయి. అందరికీ రుపే కార్డులు జారీ చేస్తున్నారు. మున్ముందు అన్ని చెల్లింపులూ వీటితోనే జరుగుతాయి. వీటన్నిటినీ సెల్‌ఫోన్లోకి తెస్తే మరింత ఈజీ అవుతాయన్న ఆలోచనతో 2014 జనవరిలో పే నియర్ సొల్యూషన్స్‌ను ఆరంభించాం.
 
అరచేతిలో స్వైప్ మిషన్..
ప్రస్తుతం మా కంపెనీ నుంచి పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్స్(ఎంపే) డివైజ్ అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌ను సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, కాఫీ షాపులు, బేకరీలు, మెడికల్ షాపులు, జిమ్స్, రిటైల్ స్టోర్లలో క్రెడిట్/డెబిట్ కార్డు బిల్లులకు విని యోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్/పీసీల్లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎంపే డివైజ్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంటర్ చేసి.. క్రెడిట్/ డెబిట్ కార్డును స్వైప్ చే స్తే చాలు చెల్లింపులు జరిగిపోతాయి.
 
మూడేళ్లలో 2 లక్షల డివైజ్‌లు..
ప్రస్తుతం ఎంపే డివైజ్‌లను దేశంలో 3 వేల వ్యాపార సంస్థలకు విక్రయించాం. వచ్చే మూడేళ్లలో 2 లక్షల డివైజ్‌లను విక్రయించాలని లక్ష్యించాం. దీన్లో ఏపీ, తెలంగాణ వాటా 20-25 శాతం ఉండొచ్చు. ఎంపే డివైజ్ సెటప్ చార్జీల కింద తొలిసారి రూ.3 వేలు... తర్వాత నెలకు రూ.400 చెల్లించాలి. ఈ డివైజ్‌ను పోలండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎంపే సేవలు దేశంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్, పుణే, మధురై, విజయవాడ నగరాల్లో, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా దేశాలకు విస్తరిస్తాం.
 
రూ.62 కోట్ల పెట్టుబడులు..
రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభించాం. విస్తరణలో భాగంగా తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పూర్తి వివరాలను ఈ నెలాఖరులోగా వెల్లడిస్తాం.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement