
బ్యాంకుల తనిఖీ నివేదికలు ఇంటెలిజెన్స్ విభాగానికీ ఇవ్వాలి
మనీ ల్యాండరింగ్, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘనలను నివారించే దిశగా బ్యాంకుల తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్, దర్యాప్తు
ఆర్‌బీఐకి కేంద్ర న్యాయ శాఖ సూచన
న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘనలను నివారించే దిశగా బ్యాంకుల తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్, దర్యాప్తు ఏజెన్సీలకు కూడా అందించాలని కేంద్ర న్యాయ శాఖ... రిజర్వ్ బ్యాంక్‌కు సూచించింది. చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఆర్థిక శాఖలో భాగమైన సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ)కి తనిఖీ వివరాలు ఇవ్వలేమంటూ ఆర్‌బీఐ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల అజమాయిషీలో ఉండే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో(యూసీబీ) నిబంధనల ఉల్లంఘన ఆరోపణల దరిమిలా 489 యూసీబీలపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. అయితే, సీఈఐబీకి చట్టబద్ధత లేని కారణంగా తనిఖీల నివేదికలను ఇవ్వలేమన్నది ఆర్‌బీఐ వాదనగా సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ఇదే కోవకి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోకి మాత్రం రిజర్వ్ బ్యాంక్ .. తనిఖీ నివేదికలు ఇస్తోందని వివరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఈఐసీ) న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై స్పందించిన న్యాయశాఖ ఈ మేరకు సలహా ఇచ్చింది.