పసిడి డిపాజిట్ స్కీమ్... | Interest rates on the bank of freedom | Sakshi
Sakshi News home page

పసిడి డిపాజిట్ స్కీమ్...

Published Sat, Oct 24 2015 8:21 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

పసిడి డిపాజిట్ స్కీమ్... - Sakshi

పసిడి డిపాజిట్ స్కీమ్...

మార్గదర్శకాలను జారీ చేసిన ఆర్‌బీఐ
- నవంబర్ 5న అధికారికంగా స్కీమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ


ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని ప్రజలు, వివిధ సంస్థల వద్దనున్న దాదాపు 20 వేల టన్నుల మేర ఉత్పాదకతకు నోచుకోని బంగారాన్ని తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా, నిరుపయోగంగా పడిఉన్న బంగారం విలువ దాదాపు రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా.
 
మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలివీ...

- బంగారం డిపాజిట్ పరిమాణానికి సంబంధించి గరిష్ట పరిమితేమీ లేదు. అయితే, కనీస డిపాజిట్ పరిమాణం(కడ్డీలు, కాయిన్లు, ఆభరణాలు- రాళ్లు, ఇతరత్రా మెటల్స్‌ను తీసేసిన తర్వాత లెక్కించేది) 30 గ్రాములకు సమానంగా(99.5 స్వచ్ఛత) ఉండాలి.
- డిపాజిటర్లు బ్యాంకులకు సమర్పించే బంగారాన్ని ట్రేడబుల్ గోల్డ్‌గా మార్చిన తర్వాత(కరిగించి, శుద్ధి చేశాక) లేదా డిపాజిట్ చేసిన రోజు నుంచి 30 రోజుల తర్వాత నుంచి వడ్డీ లెక్కింపు మొదలవుతుంది.
- గోల్డ్ డిపాజిట్‌కు సంబంధించి అసలు, వడ్డీ మొత్తాన్ని బంగారం రూపంలోనే లెక్కిస్తారు.
- మెచ్యూరిటీ(గడువు ముగింపు) సమయంలో డిపాజిటర్ బ్యాంకులో డిపాజిట్‌చేసిన బంగారానికి సమానమైన అసలు, వడ్డీని అప్పటి పసిడి మార్కెట్ రేటు ప్రకారం రూపాయిల్లో లేదా సమాన విలువగల బంగారం రూపంలోగానీ బ్యాంకులు చెల్లించవచ్చు.
- డిపాజిటర్ గోల్డ్‌ను డిపాజిట్ చేసే సమయంలోనే ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని లిఖితపూర్వకంగా బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆతర్వాత మార్చుకోవడానికి వీలుండదు.
- గోల్డ్ డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి ఉన్న బ్యాంకులు స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ, 1-3 ఏళ్లు), మధ్యకాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తాయి.
- కాగా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కనీస లాకిన్ వ్యవధి కంటే ముందే డిపాజిటర్లు వైదొలిగితే.. బ్యాంకులు నిర్దేశించే జరిమానా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
- స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్‌లను బ్యాంకులే నేరుగా తమ సొంత ఖాతాల్లోనే అనుమతిస్తాయి. మధ్య, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌ను మాత్రం భారత ప్రభుత్వం తరఫున అమలు చేయాల్సి ఉంటుంది.
- బ్యాంకులకు ఆర్‌బీఐ నిర్దేశించే నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్- డిపాజిట్ నిధుల్లో ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం) పరిధిలోకే ఎస్‌టీబీడీలు వస్తాయి.
- ఈ స్కీమ్ ద్వారా సమీకరించే బంగారాన్ని బ్యాంకులు పాటించాల్సిన ఎఎస్‌ఎల్‌ఆర్‌లో చూపించుకోవచ్చు. దీనివల్ల ఉత్పాదక రంగాల కు రుణాలిచ్చేందుకు అదనంగా మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి రానున్నాయి.
- ప్రస్తుతం సీఆర్‌ఆర్ 4 శాతంగా, ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతంగా ఉన్నాయి.
- ఈ స్కీమ్‌లో బంగారాన్ని డిపాజిట్‌గా సమీకరించిన బ్యాంకులు జ్యువెలర్లకు లేదా ఇండియా గోల్డ్ కాయిన్లను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి విక్రయించుకోవచ్చు లేదా రుణంగా ఇవ్వొచ్చు. ఇతర నిర్దేశిత బ్యాంకులకు కూడా విక్రయించవచ్చు.
- ఇక మధ్య, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌ల కింద సమీకరించే బంగారాన్ని ఎంఎంటీసీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర ఏజెన్సీ ద్వారా వేలం రూపంలో విక్రయిస్తారు. తద్వారా లభించే నిధులను ఆర్‌బీఐ వద్ద ఉండే కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement