అంతర్జాతీయ పరిణామాలు కీలకం | International developments are crucial | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పరిణామాలు కీలకం

Published Mon, Aug 20 2018 12:45 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

International developments are crucial - Sakshi

ముంబై: ప్రపంచవ్యాప్త వాణిజ్య రక్షణాత్మక చర్యలపై నెలకొన్న భయాలు, టర్కీ ఆర్థిక సంక్షోభం, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి స్థూల అంశాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. వాణిజ్య యుద్ధ పరంగా సానుకూల వాతావరణానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవారం / మార్కెట్‌కు పాజిటివ్‌గానే ఉండవచ్చని హెమ్‌ సెక్యూరిటీస్‌ డెరైక్టర్‌ గౌరవ్‌ జైన్‌ అన్నారు. టర్కీ లీరా ఏమాత్రం బలపడినా రూపాయి విలువకు స్వల్పకాలానికి కొంత బలం చేకూరుతుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అంచనావేశారు. ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ అంశాలతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కీలకంగా మారనుందని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ వెల్లడించారు. బుధవారం (ఆగస్టు 22న) బక్రీద్‌ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది.  

వడ్డీ రేట్లపై ఫెడ్‌ వ్యాఖ్య..! 
అమెరికా పాలసీ రేట్లపై ఈవారంలో ఫెడ్‌ చైర్మన్‌ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి అన్నారు. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు ప్రకటన వెలువడితే మార్కెట్‌కు ఇది ప్రతికూల అంశంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంపు దిశగా వ్యాఖ్యలు వెలువడితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు.  

ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.7,577 కోట్లు 
ఆగస్టు 1–17 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.7,577 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు ప్రొవిజినల్‌ డేటా ద్వారా వెల్లడయింది. రూ.2,409 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.5,168 కోట్లను డెట్‌ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది.  

11,495 వద్ద నిరోధం  
‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,,495 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,340 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. 

9 కంపెనీల ట్రేడింగ్‌ నిలిపివేత 
గీతాంజలి జెమ్స్, ఆమ్‌టెక్‌ ఆటో, ఈసున్‌ రేరోల్‌ అండ్‌ పనోరమిక్‌ యూనివర్సల్‌ షేర్లలో ట్రేడింగ్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబరు 4 నుంచి బీఎస్‌ఈ, 5 నుంచి ఎన్‌ఎస్‌ఈలు సస్పెండ్‌ చేయనున్నట్లు తెలిపాయి. తంబ్బి మోడరన్‌ స్పిన్నింగ్‌ మిల్స్, ఇండో పసిఫిక్‌ ప్రాజెక్ట్స్, హర్యానా ఫైనాన్షియల్, నోబుల్‌ పాలిమర్స్, సమృద్ధి రియల్టీ షేర్లలో ట్రేడింగ్‌ను నిలివేస్తున్నట్లు బీఎస్‌ఈ పేర్కొంది. డిసెంబరు 2017, మార్చి 2018 కాలానికి సంబంధించి ఈ సంస్థలు ఎల్‌ఓడీఆర్‌ రెగ్యులేషన్స్‌ పాటించలేదని బీఎస్‌ఈ తెలిపింది.  ఎల్‌ఓడీఆర్‌ నిబంధనలను ఈ సంస్థలు పాటిస్తే మళ్లీ ట్రేడింగ్‌ కొనసాగే అవకాశం ఉందని ఎక్సే్ఛంజీలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement