
ఇరవైల నుంచే ఇన్వెస్ట్‌మెంట్..
రిటైరయ్యే నాటికి నిర్దిష్టమైన రాబడి లేదా వడ్డీని అందించేలా ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు మూడు విధానాలున్నాయి.
ఏదైనా సరే వాయిదా వేస్తూ వెళ్లకుండా తక్షణం మొదలుపెడితేనే లాభం ఉంటుంది.
పెట్టుబడుల విషయంలోనూ అంతే.
ఎంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అంత అధికంగా ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది.
దీనికి సంబంధించి మరింత అవగాహన కోసం...
రిటైరయ్యే నాటికి నిర్దిష్టమైన రాబడి లేదా వడ్డీని అందించేలా ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు మూడు విధానాలున్నాయి. మొదటిదేంటంటే.. అత్యధిక రాబడులిచ్చే సాధనాన్ని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం. రెండోది... ప్రతి నెలా కట్టే వాయిదాలు లేదా పెట్టుబడులను కొంత పెంచుకుంటూ పోవడం. ఇక మూడోది... ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధిని (సంవత్సరాలు) మరింతగా పెంచుకోవడం.
ముందుగా మొదటిదాన్ని పరిశీలిద్దాం. అత్యధిక రాబడులిచ్చే సాధనాన్ని ఎంచుకుంటే రిస్కు లు కూడా అలాగే ఉంటాయన్నది బండ గుర్తు లాంటిది. ఉదాహరణకు పన్నుల అనంతరం 6-8 శాతం దాకా రాబడినిచ్చే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్‌లు, ఎన్‌ఎస్‌సీలు వంటి వాటితో పోలిస్తే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా అత్యధిక రాబడులూ అందించవచ్చు. కొద్ది నెలలు లేదా సంవ త్సరాల్లోనే కొన్ని షేర్లు అమాంతం పెరిగిపోతుంటాయి. తక్కువ ధరలో కొనుక్కుని అత్యధిక రేటులో వీటిని అమ్ముకోగలిగితే లాభమే. కానీ ఇది చెప్పినంత తేలిక కాదు.
నష్టాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. ఒకవేళ లాభాలొచ్చినా.. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నదీ ప్రశ్నార్థకమే. రిటైర్‌మెంటు కోసం ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇటువంటి అనిశ్చితి లేకుండా చూసుకోవడం ముఖ్యం.
ఇక రెండో ప్రత్యామ్నాయం విషయానికొస్తే.. ఇది కాస్త మెరుగైనదే. వీలైనప్పుడల్లా సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయండి. అయితే, ప్రతిసారీ బోలెడంత పొదుపు చేసేంత గా మన దగ్గర డబ్బుండే అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ కొండొకచో మిగిలినా ఎప్పుడో రిటైర్మెంటు కోసం ఇప్పటి నుంచే సరదాలన్నీ ఎందుకు త్యాగం చేయాలనుకుంటూ వాటిని ఖర్చు చేసేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
ఇక మిగిలినది మూడో విధానం. అదేంటంటే సాధ్యమైనంత ముందుగా ఇన్వెస్ట్‌మెంటు మొదలుపెట్టడం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే... సుదీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్ల అసలుపై మరింత అధిక వడ్డీ వస్తుంది. అంతే కాదు ఏటా వడ్డీకి వడ్డీ కూడా తోడు కావడంతో ఇంకాస్త అధికంగా వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే అంత ఎక్కువ మొత్తాన్ని ఆఖర్లో అందుకోవచ్చు.
ఈ విధానం వల్ల భారీ మొత్తం కూడబెట్టుకోవాలన్న ఆందోళనతో అధిక రాబడులిచ్చే సాధనాలను వెతుక్కుంటూ చిన్న సరదాలనూ త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు. ముందు నుంచే సురక్షితమైన సాధనాన్ని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే కాంపౌండింగ్ ప్రయోజనాల లాభం ఎక్కువగా పొందవచ్చు.
ముందుగా అంటే.. ఎంత ముందుగా ..
సాధ్యమైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయాలంటే... అసలు మొదలు ఎక్కడ అనే సందేహం ఉత్పన్నమవుతుంటుంది. సాధారణంగా భారతీయులు సగటున ఇరవైలలో ఉన్నప్పుడు ఆదాయాలను ఆర్జించడం మొదలుపెడతారు. ప్రస్తుతం చాలా మంది అధిక జీతభత్యాలే అందుకుంటున్నారు. అయితే, ఆరోగ్యం వెన్నంటే ఉండే ఈ వయసులో రిటైర్మెంట్ ప్రణాళికలకు ఎక్కువ మంది పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. తీరా ముప్పైల్లోకి వచ్చేసరికి మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది.
దానికి తగ్గట్లుగానే బాధ్యతలూ పెరుగుతాయి. ఆదాయం పెరిగినా గతంలో మాదిరి పెరుగుదల ఉండకపోవచ్చు. అలాగే నలభైలలోకి వచ్చేటప్పటికీ రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటనే ఆలోచన మొదలవుతుంది. సరే! పెట్టుబడులు మొదలెడదామనుకుంటే రిటైర్మెంట్‌కి కేవలం ఇరవైఏళ్లే మిగిలి ఉంటుంది. ఏం చేద్దామనుకున్నా అప్పుడే చేయాలి. ఈ లోగా ఆరోగ్యానికీ, ఆదాయానికీ రిస్కులు ఎదురవుతూ ఉంటాయి. దీంతో సీరియస్‌గా పొదుపు చేద్దామనుకున్నా కుదరకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంతగా ఇరవైలలోనే ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెడితే శ్రేయస్కరం.
అంతేనా...
నిత్యం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ నిత్యావసరాల ధరలు.. మిగతా వాటి రేట్లు తగ్గిన పక్షంలో మీ ఖర్చులూ తగ్గుతాయి కదా!!. దీంతో మీ దగ్గర మరికాస్త ఎక్కువ మొత్తం మిగులుతుంది. అనుకున్న సమయం కంటే ముందే రిటైర్ కావొచ్చు కూడా. అయితే, ధరలు తగ్గే తరుణంలో భవిష్యత్‌లో మీకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచుకోవడానికి నిధులను సద్వినియోగం చేసుకుంటే మంచిది. మున్ముందు అవే ఉపయోగపడతాయి. ఏదైతేనేం.. ఆర్జన మొదలైన రోజు నుంచే కొంత భాగాన్ని దాచిపెట్టడం కూడా ప్రారంభిస్తే.. రిటైరయ్యే సరికి పెద్ద మొత్తాన్నే జమచేసుకోవచ్చు.
- ఆనంద్ జేమ్స్
టెక్నికల్ రీసెర్చ్ డెస్క్ కో-హెడ్, జియోజిత్ బీఎన్‌పీ పారిబా