న్యూఢిల్లీ: కాగితం రూపంలో ఉన్న ఫిజికల్ షేర్ల పట్ల వాటాదారుల్లో ఇప్పటికీ మమకారం పోలేదు.! లిస్టెడ్ కంపెనీల్లో 98.6 శాతం కంపెనీలకు ఫిజికల్ షేర్ సర్టిఫికెట్ కలిగిన వాటాదారులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. డిజిటల్ రూపంలోకి షేర్లను మార్చుకునే అవకాశాన్ని చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినా, ఇప్పటికీ కొంత మంది ఫిజికల్ షేర్లను మార్చుకోకుండా ఉండిపోవడం గమనార్హం. డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉండేందుకు కొంత మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అవకాశం లేని రోజుల్లో వాటాలన్నీ ఫిజికల్ సర్టిఫికెట్ల రూపంలోనే ఉండేవి. నాడు జారీ చేసిన వాటాల్లో కొన్ని అదే రూపంలో, డీమ్యాట్ మోడ్‌లోకి మారకుండా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటువంటి వాటాల విలువ 2018 డిసెంబర్ నాటికి రూ.2.9 లక్షల కోట్లు ఉంటుందని క్యాపిటలైన్ డేటా ఆధారంగా అంచనా. అయితే, అంతకుముందు త్రైమాసికంలో ఉన్న రూ.3.8 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గినట్టు తెలుస్తోంది.
సెబీ గడువుతో కాస్త కదలిక
2018 డిసెంబర్ నాటికి 927 కంపెనీలకు సంబంధించి డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ సహా ఇన్‌స్ట్రుమెంట్లను విశ్లేషించి చూడగా, 914 కంపెనీల్లో ఫిజికల్ రూపంలో వాటాలు ఉన్నట్టు తెలిసింది. మార్చి త్రైమాసికంలోనూ ఈ పరిస్థితి మారి ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి క్వార్టర్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న 21 కంపెనీల వాటాదారుల వివరాలను విశ్లేషించి చూడగా ఫిజికల్ వాటాలు ఉన్నట్టు స్పష్టమైంది. అయితే, ఇటీవలి కాలంలో కాస్త కదలిక వచ్చిందని, సెబీ గడువు విధించడంతో చాలా మంది ఫిజికల్ రూపంలో ఉన్న షేర్లను డీమ్యాట్ రూపంలోకి మార్చుకునేందుకు ముందుకు వస్తున్నట్టు ఏంజెల్ బ్రోకింగ్ సీఈవో వినయ్ అగర్వాల్ తెలిపారు. షేర్లను బదిలీ చేసుకోవాలనుకుంటే డీమ్యాట్ రూపంలోకి మార్చుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 1ని గడువుగా సెబీ నిర్ణయించింది. షేర్ల మార్పిడి మినహా డీమ్యాట్ రూపంలో ఉంటే తప్ప మరొకరి పేరిట బదిలీకి అనుమతించకూడదని సెబీ గతేడాది మార్చి 28న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు గత నెల 27న సెబీ నోట్ కూడా విడుదల చేసింది. డీమ్యాట్ రూపంలో ఉంటే తప్ప సాధారణ వ్యాపార ప్రక్రియలో భాగంగా ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది.
ఈ సందర్భాల్లో అవకాశం...
వారసత్వంగా తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వాటిని తమ పేరుపైకి మార్చుకునేందుకు డీమ్యాట్ రూపంలో లేకపోయినా సరే ఇకపైనా అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ తరహా మార్పుల గురించి, షేర్లను డీమ్యాట్‌లోకి మార్చుకోవాలన్న విషయం తెలియదని కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్ విజయ్ తెలిపారు. తగినంత అవగాహన కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మార్పుల గురించి అందరికీ తెలిసేలా చూడాలన్నారు. ‘‘ఇక చాలా కేసుల్లో ఫిజికల్ రూపంలో ఉన్న వాటాల విలువ పెద్ద స్థాయిల్లో లేకపోవడం మరో అంశం. దీంతో వారసత్వంగా వచ్చిన షేర్లను, డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవడంలో ఉన్న ప్రయాసల దృష్ట్యా ఫిజికల్ రూపంలోనే కొనసాగిస్తున్నారు’’అని వినయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఆటో తదితర రంగాల్లోని కంపెనీల్లో ఇలా ఫిజికల్ వాటాలున్నాయి. వీటిల్లో ప్రభుత్వరంగ, ప్రైవేటు కంపెనీలు సైతం ఉండడం గమనార్హం. ఫిజికల్ షేర్ల బదిలీలో ఉన్న సమస్య, మోసాల నివారణకు గాను షేర్ల డీమ్యాట్ దిశగా కృషి చేయాలన్నది సెబీ బోర్డు అభిప్రాయం.
ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!!
Published Tue, Apr 9 2019 1:01 AM | Last Updated on Tue, Apr 9 2019 1:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment