
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) బంపర్ లిస్టింగ్ సాధించింది. అక్టోబర్ 3తో ముగిసిన మూడు రోజుల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లో ఐఆర్‌సీటీసీ షేర్లకు భారీ డిమాండ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 320 కాగా రెట్టింపునకుపైగా లాభాలతో కొనసాగుతుండటం విశేషం. బీఎస్‌ఈలో 103 శాతం ప్రీమియంతో రూ. 651 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 331 వద్ద లాభంతో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తితో 111 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ సాధించింది. ఎన్‌ఎస్‌ఈలో 118 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయికి రూ. 698 ని తాకింది.
ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 225 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలైన సంగతి తెలిసిందే రూ. 645 కోట్ల ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ధరలో రూ. 10 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. 2018 నుంచి రైల్వే రంగ కంపెనీలలో రైట్స్, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్‌సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్‌ఈ) ఐఆర్‌సీటీసీ రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఇష్యూకి ముందు ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నిలిచింది. 2019 ఆగస్టు 31 తో ముగిసిన ఐదు నెలల కాలంలో నెలకు సగటున 25-28 మిలియన్ లావాదేవీలు నమోదవుతున్నాయి.