బీమా ఏజెంట్లకు లెసైన్స్ అక్కర్లేదు
ఏప్రిల్ 1 నుంచి బీమా సంస్థలే నేరుగా ఏజెంట్లను నియమించుకోవచ్చు...
⇒ ఆరోగ్య బీమాకు ఇక ప్రత్యేక విభాగంగా గుర్తింపు
⇒ 2025కల్లా 250 బిలియన్ డాలర్లకు బీమా రంగం
⇒ ‘సాక్షి’తో ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఇప్పటివరకు బీమా ఏజెంట్ల నియామకం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) ద్వారానే జరిగేది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం రద్దవుతోంది. బీమా చట్టం సవరణ బిల్లును అమల్లోకి తెచ్చి, ఐఆర్‌డీఏ లెసైన్స్ లేకుండా బీమా సంస్థలకే సొంతగా వ్యక్తిగత ఏజెంట్లను నియమించుకునే వీలును కల్పిస్తున్నాం’’ అని ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ చెప్పారు. ‘ఇండియా ఇన్సూరెన్ విజన్ 2025’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా గురువారం ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనేమన్నారంటే...
⇒ దేశంలో బీమా రంగంలో ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే.. ప్రస్తుతం బీమాలో రెండు రకాల వ్యాపారాలున్నాయి. 1.లైఫ్ ఇన్సూరెన్స్. 2.నాన్-లైఫ్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా అనేది నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య బీమానూ ప్రత్యేక విభాగంగా గుర్తిస్తాం. అలాగే ఈ విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తాం. మరో ముఖ్యమైన అంశమేంటంటే భారత దేశంలో వ్యాపారం చేసేందుకు విదేశీ రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతినిచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. (రీ ఇన్సూరెన్స్ అంటే బీమా కంపెనీలు తీసుకునే ఇన్సూరెన్స్. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ జీఐసీ ఒక్కటే ఈ సేవలందిస్తోంది)
⇒ బీమా రంగం ఎంతలా వృద్ధి సాధిస్తే దేశం కూడా ఆర్థికాభివృద్ధిలో అంతలా దూసుకెళుతుంది. అందుకే బీమా రంగంలోకి... ప్రత్యేకించి జీవిత బీమా రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరముంది. వచ్చే ఐదేళ్లలో బీమా రంగంలో రూ.50-55 వేల కోట్ల పెట్టుబడులు అవసరం. కానీ, ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటిని రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి 26 శాతంగా ఉంది. దీన్ని 74 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం.
⇒ బీమా రంగ నియంత్రణలో పాత పరంపరకు స్వస్తి పలికి కొత్త ప్రణాళికలతో, ప్రాజెక్ట్‌లతో ముందుకెళుతున్నాం. బీమా పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అలాగే బీమా రిపోజిటరీ, రీ-ఇన్సూరెన్స్ ఎక్స్చెంజ్‌ల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చూస్తాం. దీంతో బీమా లావాదేవీల్లో సులభమైన, సమర్థవంతమైన పనితీరును కనబర్చవచ్చు.
⇒ మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభానే ఎక్కువ. అందుకే కేవలం 4% జనాభా మాత్రమే బీమా సదుపాయం కలిగి ఉన్నారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్తే అందుకయ్యే ఖర్చును నూటికి 86% మంది సొంతంగానే భరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సదుపాయాలలేమికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటమనేది తప్పనిసరి కాకపోవటం. ⇒ మరోపక్క ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్న వారిలో చాలా మందికి అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. దీంతో బీమా క్లెయిమ్‌ల సంఖ్య అధికమై, ఆరోగ్య బీమా కంపెనీలపై భారం పెరుగుతోంది.
ఇండియా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లోని ముఖ్యాంశాలివే...
⇒ ఏటా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) బీమా రంగం 0.37-0.39 వృద్ధిని కనబరుస్తోంది. ప్రస్తుతం దేశంలో బీమా పరిశ్రమ విలువ 125-135 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
⇒ మొత్తం బీమా రంగంలో జీవిత బీమా వాటా ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లు. ఏటా 12% వృద్ధిని కనబరుస్తోంది. 2025 నాటికి 160-175 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా. అలాగే 13 బిలి యన్ డాలర్లుగా ఉన్న సాధారణ బీమా రంగం.. ఏటా 22% వృద్ధి చెందుతోంది. 2025 నాటికల్లా 80 బిలియన్ డాలర్లకు చేరొచ్చు.
⇒ ఈ ఏడాది దేశం మొత్తం మీద 11 శాతం బీమా విపత్తు నష్టాలకు, 12 శాతం బీమా మరణాలకు అందింది.
⇒ దేశంలోని అతి పెద్ద పరిశ్రమల్లో బీమా రంగం 16వ స్థానంలో ఉంది. 2025కి తొలి 10 పరిశ్రమల్లో నిలుస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు.