కార్పొరేట్ రంగంలో మగువల హవా!
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటున్న మహిళలు కార్పొరేట్ రంగంలో కూడా దూసుకుపోతారని యాక్సెంచర్ తాజా నివేదిక అంటోంది. 2020 కల్లా అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్ స్థాయిల్లోనూ, కంపెనీల డెరైక్టర్ల బోర్డ్‌ల్లోనూ మహిళల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని కన్సల్టింగ్, టెక్నాలజీ కంపెనీ యాక్సెంచర్ నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ కంపెనీ ఈ నివేదికను రూపొందించింది. 32 దేశాలకు చెందిన మధ్య, భారీ స్థాయి సంస్థలకు చెందిన 4,100 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. కంపెనీల్లో మహిళల పురోగతి విషయమై, ఉద్యోగుల్లోనూ, కంపెనీల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఆశాభావం వెల్లడైందని ఈ నివేదిక పేర్కొంది.
ముఖ్యాంశాలు..
{పస్తుతం భారత కంపెనీల్లో సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఆరేళ్లలో ఈ సంఖ్య పెరగగలదన్న విశ్వాసాన్ని ఈ సర్వేలో పాల్గొన్న భారతీయులు వ్యక్తం చేశారు.
కంపెనీల డెరైక్టర్లుగా మహిళల సంఖ్య 2020కల్లా పెరుగుతుందని 71% మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారి సంఖ్య 40%.
2020 కల్లా మహిళా సీఈవోల సంఖ్య పెరుగుతుందని 70% మంది పేర్కొన్నారు. భారత్ విషయానికొస్తే, ఇలా చెప్పిన వారి సంఖ్య 44%, అమెరికాలో 66%గా, ఇంగ్లండ్‌లో 49 శాతంగా ఉంది.
గతేడాదితో పోల్చితే మరింత ఉన్నత స్థాయిల్లోకి మహిళా ఉద్యోగులను ప్రమోట్ చేయాలని యోచిస్తున్నామని 44% కంపెనీలు చెప్పాయి.
కాగా కంపెనీల ఉన్నత స్థాయిల్లో మహిళల సంఖ్యలో 2020కల్లా ఎలాంటి మార్పు ఉండదని జపాన్ దేశస్థులు భావిస్తున్నారు.