
ఏపీలో పెట్టుబడులకు ఇజ్రాయెల్ ఆసక్తి
⇒హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, వ్యవసాయం, నీటి వనరులపై దృష్టి
⇒దానిమ్మ, మామిడి, కూరగాయల కోసం 28 ప్రత్యేక కేంద్రాలు
⇒త్వరలోనే ఎఫ్‌టీఏపై చర్చలు
⇒ఇజ్రాయెల్ రాయబారి డేనియల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇజ్రాయెల్ ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (రాష్ట్ర శాంతి భద్రతల రక్షణకు అవసరమైన టెక్నాలజీ అందించడం), వ్యవసాయం, నీటి వినియోగ రంగాల పెట్టుబడులపై ఇజ్రాయెల్ మక్కువ చూపుతోంది. ఇందుకోసం గత ఐదు నెలల్లో నాలుగు సార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో అందులో రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు దేశంలో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మాన్ తెలిపారు. గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రాలో కూడా వ్యవసాయ రంగంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ముందుగా కూరగాయలు, మామిడి, దానిమ్మ పంటలను ఎంపిక చేశామని, వచ్చే కొద్ది నెలల్లో రాష్ర్ట వ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డేనియల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఇండో ఇజ్రాయెల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఈఎఎస్‌ఫ్ ల్యాబ్స్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్ స్టడీస్ ఏర్పాటు చేసిన సదస్సుకు డానియల్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం జరిపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడులకు అవకాశాలున్నాయని, కాని ప్రస్తుత పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకోలేకపోయామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
త్వరలో ఎఫ్‌టీఏపై చర్చలు: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని, దీనిపై వచ్చే ఏడాది ప్రారంభంలో చర్చలు జరగొచ్చన్నారు. దీనికి సంబంధించి గత నెల నవంబర్‌లో జరగాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, త్వరలోనే ఎఫ్‌టీఏ దిశగా అడుగులు పడతాయన్న ఆశాభావాన్ని డేనియల్ వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 20 ఏళ్ల క్రితం రెండు లక్షల డాలర్లుగా ఉంటే అది ఇప్పుడు 6 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఇందులో రక్షణ రంగానికి సంబంధించి ఏమీ లేవని, ఇప్పుడు ఈ రంగంలో కూడా పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి కె.పద్మనాభయతో పాటు మాజీ పోలీస్ ఉన్నతాధికారలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.