ఫలితాలు, గణాంకాలు కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఈ వారంలో వెల్లడించనున్నాయి. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారమే రానున్నాయి. ఈ ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థికాంశాలకు సంబంధించిన గణాంకాలు మూడు రోజులే ట్రేడింగ్ జరిగే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. దసరా సందర్భంగా మంగళ(ఈ నెల11న), మొహర్రం సందర్భంగా బుధవారం(ఈ నెల12న)..
రెండు రోజులు సెలవుల కారణంగా ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ రేట్లు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అనిశ్చిత పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ప్రారంభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే చలిస్తుందని నిపుణులంటున్నారు. గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలకు నేడు(సోమవారం) భారత్‌తో సహా ఆసియా మార్కెట్లు స్పందిస్తాయని వారంటున్నారు.
కాగా విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. జర్మనీ బ్యాంక్ దిగ్గజం డాయిష్ బ్యాంక్‌పై ఆందోళన తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ఆర్‌బీఐ రేట్ల కోత, రూపాయి బలపడడం, వంటి కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల మొదటి వారంలో రూ.1,445 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్ల నుంచి రూ.3,690 కోట్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం గత వారంలో భారత క్యాపిటల్ మార్కెట్లో వారి నికర పెట్టుబడులు రూ.2,245 కోట్లుగా ఉన్నాయి.
సానుకూలంగా మార్కెట్ ట్రెండ్
మార్కెట్ ఫండమెంటల్స్‌పై విదేశీ ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) దాదాపు రూ.51,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ క్షీణించిన ప్రతిసారి విదేశీ సంస్థాగత పెట్టుబడులు, రిటైల్ పెట్టుబడులు వచ్చి పడుతున్నందున సానుకూల అంచనాలే నెలకొన్నాయి. కమోడిటీల ధరల తగ్గుదలతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందిందని, ద్రవ్యోల్బణం కూడా ఊహించిన దానికన్నా కూడా తగ్గిందని ఐఎంఎఫ్ పేర్కొంది.
వృద్ధి అంచనాలను 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. లావాదేవీల వ్యయాలు, వివిధ దశల్లో బహుళ పన్నుల భారం మొదలైన వాటన్నింటినీ తగ్గించేసే జీఎస్‌టీతో భారత్ ఒక ఉమ్మడి మార్కెట్‌గా ఎదిగే అవకాశముంది. దీర్ఘకాలంలో దేశ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే కీలక పాలసీ రేట్లను పావు శాతం తగ్గించిన ప్రయోజనాలను పండుగ సీజన్ కానుకగా బ్యాంకులు తమ ఖాతాదారులకు బదలాయించగలవన్న అంచనాలు ఉన్నాయి. ఇది వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలకు తోడ్పాడునిస్తుంది. కంపెనీల క్యూ2 ఫలితాలు సైతం మార్కెట్‌కు ఊతం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
గత కొన్నాళ్లుగా పాలసీ రేట్లు పెంచని ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ఆఖరు నాటికి పెంచే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. ఇది ప్రపంచ మార్కెట్లకు ప్రతికూలంగా పరిణమించినా, ఇప్పటికే దీన్ని పరిగణనలోకి తీసేసుకుని స్పందించిన దరిమిలా .. భారత మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. మొత్తం మీద చూస్తే మార్కెట్ ట్రెండ్ సానుకూలంగా ఉంది. ఏ కారణం చేత తగ్గినా కూడా కిందికి వచ్చిన ప్రతిసారి కొనుగోలుకు అవకాశంగా భావించవచ్చు. - కేవీ సునిల్ కుమార్, అసోసియేట్ డెరైక్టర్, జియోజిత్ బీఎన్‌పీ పారిబా