ఆర్థిక వ్యవస్థ రికవరీ కష్టమే...
ఫిక్కీ సర్వేలో కార్పొరేట్ల నిర్వేదం
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ రికవరీ పట్ల భారత కంపెనీల ఆశలు అడుగంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రికవరీ కష్టమేనని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఆర్నెళ్ల నుంచి ఆర్థిక పరిస్థితుల్లోనూ, కంపెనీల స్థితిగతుల్లోనూ ఎలాంటి మెరుగుదల లేదని ఫిక్కీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. కింది స్థాయి నుంచి విధానాల అమలు సక్రమంగా జరిగినట్లయితేనే ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం మెరుగుపడుతుందని కంపెనీలు అంటున్నాయి. జూలై-డిసెంబర్ కాలానికి అంచనాలు, ఇంకా వివిధ అంశాలపై రూ.6 కోట్ల నుంచి రూ.92,000 కోట్ల టర్నోవర్ ఉన్న దాదాపు 130 కంపెనీలపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, ప్లాస్టిక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ, ఇన్‌ఫ్రా తదితర రంగాల కంపెనీలు పాల్గొన్నాయి. ఫిక్కి బిజినెస్ కాన్ఫిడెన్స్ పోల్ సర్వేలో ముఖ్యాంశాలు..
►గత ఏడాది మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం ప్రోత్సాహకరంగా పెరిగింది. ఇదే జోరు రానున్న కాలంలో కొనసాగాల్సిన ఉంది.
►రానున్న ఆర్నెళ్లలో ఆర్థిక వ్యవస్థ, కంపెనీల స్థితిగతులు కొంత మెరుగుపడవచ్చు.
►వివిధ దేశీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
►తమ కంపెనీలు 75 శాతం తక్కువ ఉత్పత్తి సామర్థ్యం స్థాయిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని 50 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.
►డిమాండ్ పడిపోవడం పట్ల 71 శాతం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.