ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఈ-ఫైలింగ్ (2015-16 అసెస్‌మెంట్ ఇయర్) గడువును ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకూ ఈ-ఫైలింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. నిజానికి ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది. అయితే చివరి రోజున ఎక్కువ మంది ఫైల్ చేయడానికి ప్రయత్నించటంతో కొన్ని ఈ-సేవలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి దేశ వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 4 కోట్లు. కాగా ఓటీపీ ఆధారిత ఐటీఆర్ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆగస్టు 31వ తేదీ నాటికి దాదాపు 29 లక్షల పన్ను రిటర్న్స్‌ను పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.