పన్ను రాబడి పెంచుకుంటేనే ప్రయోజనం! | the benefit of tax returns! | Sakshi
Sakshi News home page

పన్ను రాబడి పెంచుకుంటేనే ప్రయోజనం!

Published Fri, Oct 31 2014 12:15 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

పన్ను రాబడి పెంచుకుంటేనే ప్రయోజనం! - Sakshi

పన్ను రాబడి పెంచుకుంటేనే ప్రయోజనం!

రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయానికి సంబంధించింది రెవెన్యూ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా రెవెన్యూ రాబడి లభిస్తుంది. పన్ను రాబడి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఉంటుంది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను, మూలధన రాబడి పన్ను, బహుమతి సుంకం, ఎస్టేట్ సుంకాలు మొదలైనవి ప్రత్యక్ష పన్నులు. కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల లాంటివి పరోక్ష పన్నులు. లాభాలు, డివిడెండ్లు, వడ్డీ, పరిపాలనా, వాణిజ్య సంబంధ రూపంలోకేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభిస్తుంది.
 
కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ బడ్జెట్
కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా వర్గీకరించవచ్చు. రెవెన్యూ వ్యయాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా విభజించవచ్చు. రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రణాళికా వ్యయం.. కేంద్ర ప్రణాళికా వ్యయం; రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రణాళిక సాయంగా ఉంటుంది. రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రణాళికేతర వ్యయంలో వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయం, సబ్సిడీలు, పింఛన్లు, రాష్ట్రాలకిచ్చే గ్రాంట్లు, రైతులకు రుణాలు తదితరాలు ఉంటాయి.
 
పన్ను రాబడి:
పన్ను రాబడి మూడు విధాలుగా ఉంటుంది.  అవి:
     ఎ)    ఆదాయంపై పన్ను
     బి)    సంపద, మూలధన లావాదేవీలపై విధించే పన్ను
     సి)    వస్తువులు, సేవలపై పన్ను
 
 స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ రాబడిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. అధిక పన్నుల విధింపు, పన్ను రేట్లు ఎక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా పన్ను రాబడి పెరిగి, రెవెన్యూ రాబడి అధికమవ్వడానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ రాబడి 1950-51లో రూ.406 కోట్లు కాగా, 2013-14లో సవరించిన అంచనాల ప్రకారం రూ.10,29,252 (రాష్ట్రాల వాటా మినహాయించి) కోట్లకు చేరుకుంది. 2014-15 బడ్జెట్‌లో ఈ రాబడిని రూ. 11,89,763 కోట్లుగా ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఎక్కువ. 1950-51లో నికర పన్ను రాబడి రూ. 357 కోట్లు ఉండగా 2013-14లో సవరించిన అంచనాల ప్రకారం రూ. 8,36,026 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్‌లో ఈ రాబడిని రూ. 9,77,258 కోట్లుగా ప్రతిపాదించారు.
 మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 1970-71లో 21 శాతంగా ఉంది. ఇది 1990 -91 నాటికి 14 శాతానికి తగ్గింది. 1992లో పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత పన్ను నిర్మాణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పన్ను రాబడిలో వ్యక్తులు, కంపెనీలు చెల్లించిన ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇతర పన్నుల రాబడి కంటే ప్రత్యక్ష పన్నుల రాబడి అధికంగా ఉంది. పన్నుల యంత్రాంగాన్ని పటిష్టపరచడం వల్ల 2008-09లో మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 56 శాతానికి చేరుకుంది.  2013-14లో మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 55.9 శాతం కాగా, పరోక్ష పన్నుల వాటా 44 శాతంగా నమోదైంది.
 
 పన్ను - జీడీపీ నిష్పత్తి
 పన్ను భారాన్ని అంచనా వేయడానికి పన్ను - జీడీపీ నిష్పత్తి కొలమానంగా ఉపకరిస్తుంది. ఆర్థిక ప్రణాళిక ప్రక్రియ ప్రారంభమైన 1950-51లో పన్ను - జీడీపీ నిష్పత్తి 6.3 శాతంగా నమోదైంది. ఈ నిష్పత్తి 1990-91 వరకు పెరిగి ఆ తర్వాత కాలంలో తగ్గింది. పన్ను రేట్లలో తగ్గుదల కారణంగా 1990వ దశకంలో పన్ను - జీడీపీ నిష్పత్తిలో తగ్గుదల 1 శాతంగా ఉంది. 2009-10లో ఈ నిష్పత్తి 9.6 శాతం నుంచి 2012-13లో 10.2 శాతానికి పెరిగింది. 2013-14లో ఈ నిష్పత్తి 10 శాతంగా ఉంటుందని అంచనా. మొత్తం పన్ను - జీడీపీ నిష్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.6 శాతం, పరోక్ష పన్నుల వాటా 4.4 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు.
 అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లో పన్ను - జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉంది. ఈ నిష్పత్తి యూకేలో 34.3 శాతం కాగా, జర్మనీలో 37 శాతం, అమెరికాలో 24 శాతంగా ఉంది. ఈ నిష్పత్తి పెంచుకోవడానికి భారత్ ఎక్కువగా ప్రత్యక్ష పన్నులపై ఆధారపడాలి. సంపద, Inheritance taxes ను పెంచడం, కార్పొరేట్ సంస్థలకిచ్చే మినహాయింపులను తొలగించడం ద్వారా ప్రత్యక్ష పన్ను రాబడి పెంచుకోవాలి.
 
 2014-15 బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ప్రతిపాదనలు
     వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్‌‌సకు సంబంధించి ఈ పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80(సి)లో పెట్టుబడి పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులో భాగంగా గృహ రుణాలపై వడ్డీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేర్చారు. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ సంస్థలపై విధించే సర్‌చార్జీలో ఏ విధమైన మార్పులేదు. ఎడ్యుకేషన్ సెస్ 3 శాతంగా కొనసాగుతుంది.
 -    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించి అభిలషణీయమైన పన్ను విధానం ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్‌‌డ ఆఫ్ ఇండియా నియంత్రణకు లోబడి ట్రస్ట్‌ల ఏర్పాటును ప్రతిపాదించారు.
 -    కొత్త ప్లాంటులు, యంత్రాలపై ఏ సంవత్సరంలోనైనా రూ. 25 కోట్ల పెట్టుబడి పెట్టిన తయారీ రంగ కంపెనీలకు పెట్టుబడి అలవెన్సు 15 శాతంగా ప్రకటించారు. ఈ ప్రోత్సాహకం మార్చి 2017 వరకు వర్తిస్తుంది.
 -    మార్చి 2017 నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం, పంపిణీ, ట్రాన్‌‌సమిషన్‌లో నిమగ్నమైన కంపెనీలకు పదేళ్ల పన్ను విరామం ప్రకటించారు.
 -    విదేశీ పోర్‌‌టఫోలియో పెట్టుబడిదారులకు సెక్యూరిటీల లావాదేవీల ద్వారా లభించిన ఆదాయాన్ని మూలధన రాబడులుగా పరిగణిస్తారు.
 -    అన్ని విధాలైన బాండ్లపై పన్ను ప్రోత్సాహకం ఉంటుంది.
 -    విదేశీ కరెన్సీలో పొందే రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులపై 5 శాతం Concession tax ఉంటుంది. ఇది 2015 జూన్ 30 నుంచి 2017 జూన్ 30 వరకు పొందే రుణాలకు వర్తిస్తుంది.
 -    ఆదాయ, డివిడెండ్ల పంపిణీ పన్నును మొత్తం స్థూల విలువ (Gross Amount) పై విధిస్తారు.
 
 పరోక్ష పన్నులు
 -    బాక్సైట్‌పై ఎక్సైజ్ డ్యూటీ 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు.
 -    దిగుమతైన స్టెయిన్‌లెస్ స్టీల్‌కు సంబంధించి Flat-roled ProductsO పె కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 7.5 శాతానికి చేర్చారు.
 -    మెటలర్జికల్ కోక్‌పై కస్టమ్స్ డ్యూటీ 0 నుంచి 2.5 శాతానికి పెంచారు.
 -    Coal tax Pitch కస్టమ్స్ డ్యూటీ 10 శా తం ఉండగా దీన్ని 5 శాతానికి మార్చారు.
 -    డోలమైట్‌పై దిగుమతి సుంకం 5 నుంచి 2.5 శాతానికి తగ్గించారు.
 -    రసాయనాలు, పెట్రో కెమికల్ రంగంలో నూతన పెట్టుబడులు, సామర్థ్యం పెంపునకు సంబంధించి కొన్ని అంశాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు.
 -    కలర్ పిక్చర్ ట్యూబ్‌లను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు.
 -    19 ఇంచులకు తక్కువగా ఉన్న ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 0 కు తగ్గించారు.
 -    సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి యంత్రాలు, పరికరాల దిగుమతులపై 5 శాతం ఉన్న Concessional Customs Duty  కొనసాగిస్తున్నారు.
 -    సిగరెట్లపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ రేట్లను 11 నుంచి 72 శాతానికి పెంచారు.
 -    పాన్ మసాలాపై ఎక్సైజ్ డ్యూటీ 12 నుంచి 16 శాతానికి పెంచారు. ఉత్పత్తి చేయని పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ 50 నుంచి 55 శాతానికి పెంచారు.
 -    ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న Free Baggage Allowanceను రూ. 35,000 నుంచి రూ.40,000కు మార్చారు.
 -    Renewable Energy  అభివృద్ధికి అనేక ఐ్ట్ఛఝట పై ఎక్సైజ్ డ్యూటీని మినహాయించారు.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 
 నేను గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాను. ఎకానమీని ఏవిధంగా అధ్యయనం చేయాలో సూచించండి.
 -డి. కల్పనా రెడ్డి, నిజామాబాద్.
 గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎకానమీ అత్యంత కీలమైంది. ప్రతి పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్‌లో ఎకానమీకి సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు వర్తమాన అంశాల (Contemporary Issues)పై అవగాహన పెంచుకుంటూ అధ్యయనం చేయాలి. ముందుగా మౌలికాంశాల (Basic Concepts)పై పట్టు సాధించాలి. వివిధ పోటీ పరీక్షల్లో వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
 ఎకానమీని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. దీంట్లో భాగంగా వివిధ అకడమిక్, రిఫరెన్సు పుస్తకాలను పరిశీలిస్తూ కింది అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 1.    స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ
 2.    భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులు
 3.    ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి
 4.    ప్రణాళిక లక్ష్యాలు-వ్యూహాలు-వనరుల సమీకరణ-ఇటీవలి ప్రణాళికల్లో పరి వ్యయాలు- లోటు బడ్జెటింగ్ విధానం- గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు
 5.    సమ్మిళిత వృద్ధి
 6.    పేదరికం - నిరుద్యోగం - ద్రవ్యోల్బణం
 7.    బ్యాంకింగ్ రంగం
 8.    పన్నుల వ్యవస్థ- వస్తు, సేవలపై పన్ను
 9.    అంతర్జాతీయ వాణిజ్యం
 10.    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి
 11.    అవస్థాపనా రంగం
 12.    IMF, ప్రపంచబ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ
 13.    జాతీయాదాయం
 14.    మానవాభివృద్ధి
 15.    భారత్‌లో బడ్జెటింగ్ విధానం
 16.    జనాభా
 17.    భూ సంస్కరణలు
 ఈ అంశాలపై ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఎకానమీలో భాగంగా కింద పేర్కొన్న విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నట్లు గమనించవచ్చు.
-    బ్యాంకింగ్ రంగం
-    పన్నుల వ్యవస్థ - బడ్జెటింగ్ విధానం
-    అంతర్జాతీయ వాణిజ్యం
-    ప్రణాళికలు-గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు
-    జాతీయాదాయం - మానవాభివృద్ధి
-    ద్రవ్యోల్బణం - పేదరికం - నిరుద్యోగం
-    2011 జనాభా గణాంకాలు
 -    IMF, ప్రపంచ వాణిజ్య సంస్థ
 
 కరెంట్ అఫైర్‌‌సలో భాగంగా.. వాణిజ్య సదుపాయ ఒప్పందం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నాయక్ కమిటీ సిఫార్సులు, నల్లధనం, జన్‌ధన్ యోజన, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, రిజర్‌‌వబ్యాంక్ ఇటీవల ప్రకటించిన ద్రవ్యవిధానం, మోడీ అమెరికా పర్యటన ముఖ్యాంశాలు, భవిష్యత్తులో ప్రణాళికా సంఘం పాత్ర, వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    2013-14 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత?
-    రూ. 13,99,540 కోట్లు
 2.    కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక రాబడినిచ్చే ప్రత్యక్ష పన్ను?
-    కార్పొరేషన్ పన్ను
 3.    2014-15 బడ్జెట్‌లో పన్నేతర రాబడిలో అధిక రాబడి దేని ద్వారా లభిస్తుందని అంచనా?
-    డివిడెండ్లు, లాభాలు
 4.    మూలధన వ్యయాన్ని ఏ వ్యయంగా వ్యవహరిస్తారు?
-    పెట్టుబడి వ్యయం
 5.    2013-14లో భారత్‌లో పన్ను-జీడీపీ నిష్పత్తి ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు?
-    10 శాతం
 - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి
 ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement