
ఐటీసీ లాభం రూ.2,361 కోట్లు
- క్యూ4లో 3.65 శాతం వృద్ధి
- షేరుకి రూ.6.25 డివిడెండ్
న్యూఢిల్లీ: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీ లాభాల జోరు తగ్గింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్(2014-15, క్యూ4)లో సంస్థ నికర లాభం స్వల్పంగా 3.65 శాతం వృద్ధి చెంది రూ.2,361 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.2,278 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి మందగించడం, వ్యవసాయోత్పత్తుల విభాగ ఆదాయాలు క్షీణించడం.. లాభాలపై ప్రభావం చూపాయి. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.9,188 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో రూ.9,145 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా 0.47 శాతమే ఆదాయం పెరిగింది.
విభాగాల వారీగా...:
- కంపెనీకి అత్యంత ప్రధానమైన ఎఫ్‌ఎంసీజీ(సిగరెట్లతో సహా) విభాగం ఆదాయం క్యూ4లో 6 శాతం పెరిగి రూ.6,771 కోట్లుగా నమోదైంది. ఇందులో సిగరెట్ల వ్యాపారం నుంచి ఆదాయం కేవలం 3.23 శాతం వృద్ధితో రూ.4,211 కోట్లుగా ఉంది. సిగరెట్లేతర ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం ఆదాయం 10.88 శాతం వృద్ధి చెంది రూ.2,567 కోట్లను తాకింది.
- హోటళ్ల వ్యాపారం క్యూ4 ఆదాయం 8.08 శాతం వృద్ధితో రూ.321 కోట్ల నుంచి రూ.346 కోట్లకు పెరిగింది.
- అగ్రి(వ్యవసాయ సంబంధ) బిజినెస్ ఆదాయం 28.75 శాతం పడిపోయి రూ.1,428 కోట్లకు పరిమితమైంది.
- పేపర్, పేపర్‌బోర్డులు, ప్యాకేజింగ్ వ్యాపారానికి సబంధించి ఆదాయం కూడా 4.64 శాతం దిగజారి రూ.1,203 కోట్లుగా నమోదైంది.
- ఇక 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ నికర లాభం రూ.9,608 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.8,785 కోట్లతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధితో రూ.32,883 కోట్ల నుంచి రూ.36,083 కోట్లకు ఎగసింది.
- కంపెనీ బోర్డు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకి రూ.6.25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.