ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం
♦ పూర్తి వాటా విక్రయించిన ఐటీసీ
♦ డీల్ విలువ రూ.160 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది. ఈ వాటాను రూ.160 కోట్లకు విక్రయించనున్నామని ఐటీసీ కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నమోదైన కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ.. ఐటీసీ తయారు చేసిన సిగరెట్లను అమెరికాలో పంపిణి చేస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీలో పూర్తి వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను తమ కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని ఐటీసీ వివరించింది.
దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ నెల 8న జరిగిందని, ఈ విక్రయానికి అమెరికాలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. ఏస్, చక్కర్స్, హై-వాల్, గోల్డ్ క్రెస్ట్‌బ్రాండ్లను కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ పంపిణి చేస్తోంది. ఈ విక్రయం పూర్తయిన తర్వాత కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ తమ అనుబంధ కంపెనీగా కొనసాగదని ఐటీసీ స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐటీసీ షేర్ అర శాతం లాభపడి రూ.240 వద్ద ముగిసింది.