మహిళా మనీ | It's tough for women on a break to return: Vibha Padalkar | Sakshi
Sakshi News home page

మహిళా మనీ

Published Mon, May 18 2015 2:50 AM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

మహిళా మనీ - Sakshi

మహిళా మనీ

ముగ్గురు మహిళల కథలివి..
సుమ పెళ్లి చేసుకోలేదు. భారీ జీతం వచ్చే మంచి ఉద్యోగం... బోలెడంత విలాసవంతమైన జీవనమూ ఉంది. కాకపోతే రిటైర్మెంట్ దగ్గరవుతున్న తరుణంలో ఆమెకు ఆర్థికపరంగా జ్ఞానోదయమైంది. ఇప్పటిదాకా అలవాటు పడిన లైఫ్ స్టయిల్‌ను జీవితాంతం కొనసాగించాలంటే తాను కూడబెట్టినది ఏ మూలకూ సరిపోదని ఆమెకు అప్పుడు తెలిసొచ్చింది.
 
స్వప్న విషయానికొస్తే... కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితం సజావుగానే సాగింది. తనకొచ్చే జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం వాడేసేది. పెట్టుబడుల సంగతులన్నీ భర్త చూసుకునేవాడు. అయితే వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. తన పేరు మీద రూపాయి కూడా లేదని తెలిసింది.
 
సింధూర భర్త... దురదృష్టవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆమె ఎన్నడూ ఆర్థిక విషయాల గురించి అంతగా పట్టించుకోలేదు. దీంతో ఆ పరిజ్ఞానమూ లేదు. ఫక్తు గృహిణి కావడంతో భర్త చేసిన పొదుపు మొత్తాల గురించి గానీ తీసుకున్న బీమా పాలసీల గురించి గానీ తెలియలేదు.
 
ఈ ముగ్గురు మహిళలదీ ఒక్కొక్క రకం కష్టం. మానసికంగా ఎదురయ్యే బాధను ఎలాగోలా దిగమింగుకున్నా.. ఆర్థికంగా వారికి ఎదురైన దెబ్బ చాలా బలమైనదే. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మహిళలు తీసుకోతగిన ఆర్థికపరమైన జాగ్రత్తల గురించి వివరించేదే ఈ కథనం.

 
మహిళల అవసరాలు భిన్నమైనవా?
అవును! కచ్చితంగా!! ఎందుకంటే సామాజికంగా, ఆరోగ్యపరంగా మహిళలకు ఎదురయ్యే రిస్కులు, బాధ్యతలు భిన్నమైనవి. మాతృత్వ మాధుర్యానికి ఆర్థిక బాధ్యతలు అదనమవుతాయి. ఇటు ఇల్లు, అటు ఆఫీసు చూసుకునే క్రమంలో కొన్నిసార్లు మంచి కెరీర్‌ను వదులుకోవాల్సి రావొచ్చు. తక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు చేయాల్సి రావొచ్చు. దీంతో ఆదాయ మార్గాలు, పొదుపు మొత్తాలు తగ్గిపోతాయి. దీన్నుంచి కోలుకోవాలంటే మళ్లీ బోలెడంత కాలం పట్టేస్తుంది.
 
ఆరోగ్యపరంగా కూడా మహిళల సమస్యలు ప్రత్యేకమైనవి. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వి ప్రతి పదిమంది మహిళల్లో ఒకరికి వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి చికిత్స కోసం జీవితకాల పొదుపు మొత్తాలు కూడా సరిపోవు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇటువంటివి వస్తే ఎదుర్కోవటానికి తగిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి వైధవ్యం వల్ల, విడాకుల వల్ల లేదా వివాహం చేసుకోవద్దని నిర్ణయించుకోవడం వల్ల కొందరు మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. ఇలాంటి వారు ఏదో ఒక సమయంలో తమ ఆర్థిక పరిస్థితులను తామే చూసుకోవాల్సి వస్తుంది.
 
ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినవి ..

తొలిసారి ఉద్యోగంలో చేరినప్పట్నుంచే మహిళలు ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదలుపెట్టాలి. కింది అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి.
డబ్బు గురించి తెలుసుకోవాలి. ఆదాయం ఆర్జించడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టి రెట్టింపయ్యేలా చూసుకోవడం, దాన్ని సురక్షితంగా కాపాడు కోవడంపై దృష్టి పెట్టాలి.
మనకి నిలకడగా వచ్చే ఆదాయాలు, సమీప భవిష్యత్తులోనూ, దీర్ఘకాలంలోను తలెత్తే ఖర్చులపై ఒక అంచనాకు రావాలి.
రిస్కు సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేయాలి. ఉద్యోగంలో చేరిన రోజు నుంచే రిటైర్మెంట్ కోసం కూడా ప్లానింగ్ మొదలుపెట్టాలి.  అర్థం కాని సాధనాల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అన్ని వేళలా మీ ఆర్థిక పరిస్థితులు మీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. పెళ్లయ్యాక కుటుంబ ఆర్థిక బాధ్యతల్లో కొన్నింటిని పంచుకోవాల్సి రావొచ్చు.
   
సరైన ప్లానింగ్ దిశగా అడుగులు..
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం: ఇంటి కొనుగోలు, రిటైర్మెంట్ నిధి, వ్యాపారం ప్రారంభించడం, కారు కొనుగోలు ఇలా ఏ ఆర్థిక లక్ష్య మైనా ఆచరణాత్మకంగా ఉండాలి. ఎంత డబ్బు అవసరమవుతుంది, ఎంత కాలం పడుతుంది అన్నవి చూసుకోవాలి. దీని వల్ల ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఆలోచించుకోవచ్చు.
ప్రణాళిక తయారు చేసుకోవడం: మన ఆస్తులు, అప్పులు, భవిష్యత్‌లో వచ్చే ఆదాయాలు, ఖర్చులను అంచనా వేసుకోవడంతో ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మొదలవుతుంది. కాలవ్యవధి, రిస్కు సామర్థ్యం, పెట్టుబడి సాధనాలు వంటివీ చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తం పక్కన పెట్టుకోవాలి. వివిధ అవసరాల కోసం వివిధ పెట్టుబడి సాధనాలున్నాయి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

పెట్టుబడులు మొదలుపెట్టడం: క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడమే ఆర్థిక ప్రణాళిక విజయానికి కీలకం. ప్రస్తుతం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఇన్వెస్ట్ చేయడం కూడా ప్రాచుర్యంలోకి వస్తోంది. పెట్టుబడి సాధనం స్వభావం, రిస్కులు మొదలైనవి క్షుణ్నంగా తెలుసుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలి.
పెట్టుబడి ఫలాలు అందుకోవడం: జీవిత బీమా పాలసీ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీ పత్రాలు సమర్పించడం, మెచ్యూరిటీ మొత్తాలు చేతికొచ్చే దాకా ఫాలో అప్ చేయడం మొదలైనవి ఉంటాయి. ఆయా పెట్టుబడులను ఉపసంహరించిన తర్వాత పన్నులేమైనా కట్టాల్సి ఉంటుందా అన్న అంశంపై ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సలహా తీసుకోవడం మంచిది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement