న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్ అయినా.. డెనిమ్ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్ మార్కెట్ పరిమాణం మూడొంతులు పెరిగి రూ.21,993 కోట్లకు చేరుకుందని యూరో మానిటర్ అనే సంస్థ నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా 2018లో ఈ మార్కెట్ 14 శాతం వృద్ధి చెందింది. 2009 తర్వాత ఒక ఏడాదిలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం మళ్లీ ఇదే. గత కొన్నేళ్లుగా డెనిమ్ అమ్మకాలు ఏటా 9–11 శాతం స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన జరా, హెచ్‌అండ్‌ఎం, జాక్ అండ్ జోన్స్, గ్యాప్ గత దశాబ్దంలో మార్కెట్ వృద్ధికి తోడ్పడ్డాయి.
యువతే ప్రోత్సాహకం
‘‘మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) కారణంగా పనిచేసే చోట సంస్కృతి మారిపోవడం, యువతకు డెనిమ్ ఏకరీతి వస్త్రధారణ కావడం ఈ సంస్కృతికి దారితీసింది. దీంతో ఇదొక మెగా ట్రెండ్‌గా మారింది’’ అని లెవిస్ ఇండియా ఎండీ సనీవ్ మొహంతి పేర్కొన్నారు. ఈ సంస్థ 2018–19లో అమ్మకాలను 25% పెంచుకుని రూ.1,104 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘ఫ్యాషన్ నుంచి డెనిమ్ ఎప్పటికీ బయటకు వెళ్లలేదు. ఇప్పుడు అవగాహన మరింత పెరిగింది.
వేగంగా అమ్ముడుపోయే వాటికి బదులు విశ్వసనీయ బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ ఫ్యూచర్ రిటైల్ జాయింట్ ఎండీ రాకేశ్ బియానీ పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా తనకున్న రిటైల్ దుకాణాల పరిధిలో ఏటా కోటి వరకు జీన్స్‌ను విక్రయిస్తోంది. ఫార్మల్ వస్త్ర ధారణకు బదులు స్మార్ట్ క్యాజువల్స్‌ను ధరించే ధోరణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోందని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా బోటమ్‌వేర్ (నడుము కింద ధరించే వస్త్రాలు) విషయంలో డెనిమ్‌కు బలమైన డిమాండ్ ఉన్నట్టు స్పైకర్ సీఈవో సంజయ్ వఖారియా తెలిపారు.
ఎంపికలెన్నో...
మోనోక్రోమ్ డెనిమ్, అథ్లీష్యూర్ డెనిమ్, ఫ్లేర్డ్ డెనిమ్, హైవెయిస్ట్ ఫిట్, క్యారట్‌ఫిట్ నుంచి గతంలో నడిచిన క్లాసిక్ క్యాలిఫోర్నియన్ ఫిట్, మైనింగ్ జీన్స్ వరకు... వినియోగదారులకు జీన్స్ విషయంలో విస్తృతమైన శ్రేణి అందుబాటులో ఉండడం వారికి సౌకర్యంగానూ, ఈ మార్కెట్ వృద్ధికి ఊతంగానూ ఉంటోంది. డెనిమ్స్‌కు సంబంధించి రంగులు, ఫిట్టింగ్, డిజైన్లు, కొత్త స్టయిల్స్ విషయంలో కంపెనీలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొస్తున్నట్టు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్‌కుమార్ అన్నారు. ‘‘అప్పారెల్, లైఫ్‌స్టయిల్ విభాగంలో వినియోగం మందగించని విభాగాల్లో డెనిమ్ కూడా ఒకటి. ఈ ఏడాది కూడా దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంది’’ అని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ సీఈవో జే సురేష్ పేర్కొన్నారు. ఇతర విభాగాల్లో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. అన్ని బ్రాండ్లలోనూ డెనిమ్ వస్త్రాల అమ్మకాలు స్థిరంగా 10–15 శాతం మధ్య పెరుగుతున్నట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment