
ముంబై: బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గుతుందా? అవును.. తగ్గచ్చంటోంది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా. ప్రస్తుత ఏడాది బంగారు ఆభరణాల డిమాండ్ 2– 4 శాతం మేర పడిపోవచ్చని అంచనా వేసింది. అధిక ధరలు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. అయితే విలువ పరంగా చూస్తే.. బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 5–7 శాతం పెరగొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘గోల్డ్ జువెలరీ డిమాండ్ 2018లో 2–4 శాతంమేర పడిపోవచ్చు. గత మూడు నెలలుగా బంగారు ఆభరణాల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
అలాగే పవిత్రమైన రోజుల సంఖ్య తక్కువగా ఉంది. మరొకవైపు రత్నాభరణాల రంగంపై ఈ మధ్య కాలంలో పర్యవేక్షణ ఎక్కువయింది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీకుమార్ తెలిపారు. క్రెడిట్ లభ్యత కష్టతరంగా మారడంతో జువెలరీ రిటైలర్లకు మూలధన ఇబ్బందులు ఎదురుకావొచ్చని అభిప్రాయపడ్డారు. భారత్ మార్కెట్‌కు మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన సామాజిక ఆర్థికపరమైన అంశాల కారణంగా పరిశ్రమ ఆదాయం 7–8 శాతంమేర పెరగొచ్చని అంచనా వేశారు. కాగా బంగారు ఆభరణాల డిమాండ్ 2017లో పరిమాణం పరంగా 12 శాతం, విలువ పరంగా 9 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment