రోజూ రూ.8 కోట్లు జేబులోకి...
ముంబై: బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రోజూ రూ.8.40 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికిపైగా ఆయన అలా సంపాదిస్తూనే ఉన్నారు. షేర్ మార్కెట్లో బుల్ రన్‌తో ఆయన ఆదాయం కూడా పెరిగిపోతూ ఉంది. ఆయన కుటుంబ సభ్యుల పోర్ట్‌ఫోలియో విలువ ఏడువేల కోట్ల రూపాయలు మించిపోయిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది.
2008లో ముగిసిన బుల్ రన్‌లో ఝున్‌ఝున్‌వాలా బిలియనీర్ (బిలియన్ = 100 కోట్లు) అయ్యారు. తర్వాత మార్కెట్ల పతనం ప్రభావం అందరితోపాటే ఝున్‌ఝున్‌వాలాపైనా పడింది. 2009 మార్చి నాటికి ఝున్‌ఝున్‌వాలా వద్ద ఉన్న మొత్తం షేర్ల విలువ రూ.1,130 కోట్లకు క్షీణించింది. 2007 డిసెంబర్ నాటి విలువ రూ.3,461 కోట్లతో పోలిస్తే ఇది మూడోవంతే. అయితేనేం, ప్రస్తుత బుల్ రన్‌తో ఆయన ఆస్తులు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. గతేడాదిలో పరిశీలిస్తే... ఆయన నెట్‌వర్త్ వారానికి రూ.59 కోట్లు, నెలకు రూ.256 కోట్ల చొప్పున పెరిగింది.
జూన్ చివరి నాటికి ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం నెట్‌వర్త్ రూ.7,261 కోట్లు. ఏడాది క్రితం ఇది కేవలం రూ.4,192 కోట్లు మాత్రమే. దేశీయ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన 5,463 కంపెనీల్లో దాదాపు 96% కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్తే అధికం. (ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీల్లోని హోల్డింగ్స్ ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించాం.) ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, ర్యాలీస్ ఇండియా, అరబిందో ఫార్మా, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీల ఈక్విటీల ధర గత నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి.
ఈ కంపెనీలన్నిటిలోనూ ఒక్కోదాంట్లో రూ.100 కోట్లకు మించిన విలువైన షేర్లు ఈ కుటుంబం వద్ద ఉన్నాయి. ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్త్ కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఇండియన్ హోటల్స్ (మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,041 కోట్లు), ముత్తూట్ ఫైనాన్స్ (రూ.7,028 కోట్లు), యూనిటెక్ (రూ.6,837 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (రూ.6,254 కోట్లు), డిష్ టీవీ ఇండియా (రూ.6,171 కోట్లు) ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ఫెడరల్ బ్యాంక్, ఈడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఓరియంట్ సిమెంట్, మెక్‌నల్లీ భారత్ ఇంజినీరింగ్ వంటి కంపెనీలు ఆయన పోర్ట్‌ఫోలియోలో చేరాయి.
జూన్ క్వార్టర్లోనే ఆయన ఎంసీఎక్స్‌లో 1.45 వాటాను ఓపెన్ మార్కెట్లో కొన్నారు. తర్వాత ఒక్కో ఈక్విటీ రూ.664 ధరకు ఎంసీఎక్స్‌లో 1.96 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ఈ స్టాకు రూ.824 వద్ద క్లోజైంది.
టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, కరూర్ వైశ్యాబ్యాంక్, ఎ టూ జడ్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీల్లో హోల్డింగ్‌ను ఝున్‌ఝున్‌వాలా ఇటీవల తగ్గించుకున్నారు. కంపెనీల షేర్లే కాదు, ముంబైలో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కొన్నారని సమాచారం. అంతేనా, కోట్ల విలువైన అనేక రేసు గుర్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి.