
కొత్త ఏడాది వస్తుందంటే... రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్లతో టెల్కోలకు షాకిస్తోంది. ఇప్పటికే న్యూఇయర్ 2018 సందర్భంగా మరో రెండు కొత్త ప్లాన్లతో రిలయన్స్ జియో తన కస్టమర్ల ముందుకు వచ్చేసింది. జియో న్యూఇయర్ ప్లాన్ల ఎఫెక్ట్‌తో దిగ్గజ టెల్కోలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను మురిపించబోతున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్, జియో న్యూఇయర్ ప్లాన్లకు ఫస్ట్ సవాల్‌గా రెండు సరికొత్త ప్లాన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి రూ.198 ఆఫర్. మరొకటి రూ.229 ఆఫర్. రూ.199 ఆఫర్ కింద వొడాఫోన్ తన కస్టమర్లకు రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజూ 1జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకేనని, 28 రోజుల పాటు వాలిడిటీలో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
రెండో వొడాఫోన్ ప్లాన్ రూ.229పై కూడా రోజుకు 1జీబీ డేటా, అపరమిత కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ కొత్త యూజర్లకు మాత్రమేనని తెలిసింది. ఈ రెండు ప్లాన్లు వొడాఫోన్ 4జీ సర్కిల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్‌ను టార్గెట్ చేసి ఈ రెండు ప్లాన్లను వొడాఫోన్ ప్రవేశపెట్టింది. న్యూఇయర్ సందర్భంగా జియో రూ.199, రూ.299తో కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. రూ.198తో 28 రోజుల వాలిడిటీలో ఎయిర్‌టెల్ గత నెలలోనే సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.199 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.