ఈ-కామర్స్‌లో ఉద్యోగాల వెల్లువ..! | job notification in E-Commerce | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల వెల్లువ..!

Published Mon, Oct 6 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల వెల్లువ..!

ఈ-కామర్స్‌లో ఉద్యోగాల వెల్లువ..!

న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ వ్యాపార(ఈ-కామర్స్) రంగం జోరుతో ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో ఈ-కామర్స్ పరిశ్రమ 20-25 శాతం వృద్ధిని సాధించనుందని.. కనీసం 1.5 లక్షల కొత్త కొలువులను అందించనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిశ్రమ పరిమాణం రూ.18,000 కోట్లుగా ఉంది. 2016 నాటికి ఇది రూ.50 వేల  కోట్లకు చేరవచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు.

దీనిప్రకారం చూస్తే ఉద్యోగాల్లోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం తాము ఈ-కామర్స్ పరిశ్రమపై చాలా బుల్లిష్‌గా ఉన్నామని ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఇండియా ఎండీ జోసెఫ్ దేవసియా చెప్పారు. రెండుమూడేళ్లలో 1.5 లక్షల  ఉద్యోగాలను ఈ-కామర్స్ రంగం సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, మింత్రా వంటి దిగ్గజాలు భారీగా ఆదాయాలను ఆర్జిస్తున్నాయని.. ఈ ఏడాది తమ సంస్థ నుంచి మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని  బిట్స్ పిలానీలో నియామకాల విభాగం చీఫ్ మణిశంకర్ గుప్తా చెప్పారు.

 దండిగా వేతనాలు..: గడిచిన ఏడాది వ్యవధిలో దేశీయంగా చాలావరకూ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు 10-40 శాతం మేర వేతనాలను పెంచాయని గుప్తా చెప్పారు. ప్రస్తుతం రూ.10-23 లక్షల మేర వేతనాలను ఆఫర్ చేస్తున్నాయని.. పెద్దసంఖ్యలో ప్రారంభస్థాయి ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మధ్య-సీనియర్ స్థాయి సిబ్బంది వేతనాలు వార్షికంగా 10-15% పెరుగుతున్నాయని.. దీనికితోడు ప్రోత్సాహకంగా ఇస్తున్న షేర్ల(ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)తో ఆయా ఉద్యోగుల పంట పండుతోందని కూడా గుప్తా పేర్కొన్నారు.

ఈ-కామర్స్‌లో జూనియర్ స్థాయి సిబ్బందికి వార్షికంగా రూ.1.45 లక్షలు-రూ.3 లక్షలు.. మధ్యస్థాయి(మిడ్ మేనేజ్‌మెంట్) ఉద్యోగులకు ఏటా రూ.12-30 లక్షల మేర వేతన ప్యాకేజీలు లభించనున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచితా దత్తా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement