నగలు జీవితంలో భాగమయ్యాయి  | Joyalukkas to open store in Hyd today | Sakshi
Sakshi News home page

నగలు జీవితంలో భాగమయ్యాయి 

Published Wed, Apr 17 2019 12:43 AM | Last Updated on Wed, Apr 17 2019 7:57 AM

Joyalukkas to open store in Hyd today - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ‘ఆభరణాలు ధరించడటమనేది భారతీయుల రక్తంలోనే ఉంది. అందుకే ఇవి జీవితంలో ఒక భాగమయ్యాయి. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, అక్షయ తృతీయ వంటివి వచ్చాయంటే చాలు!! ఎంతో కొంతైనా బంగారు నగలు కొనుగోలు చేస్తారు’ అని ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జోయ్‌ ఆలుక్కాస్‌ చెప్పారు. దేశంలో ఇప్పటికే 82 షోరూమ్‌లున్న ఈ సంస్థ... 83వ షోరూంను హైదరాబాద్‌లోని ఏఎస్‌ రావు నగర్‌లో ఏర్పాటు చేసింది. బుధవారం దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జోయ్‌ అలుక్కాస్‌ ఇక్కడికొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. 

నమ్మకం కొనసాగుతోంది.. 
మా నాన్నగారు 1956లో బంగారం వ్యాపారం మొదలుపెట్టారు. నాటి నుంచి మాపై కస్టమర్ల నమ్మకం కొనసాగుతోంది. మాకు కస్టమర్ల అభిరుచులు తెలుసు. జోయాలుక్కాస్‌లో అత్యుత్తమమైన ధర ఉంటుంది. అందుకే మా దగ్గర ఆభరణాలను సంతోషంగా కొంటారు. మంచి డిజైన్లు అందుబాటులో ఉండటం మరో కారణం. ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నాం. ఎనిమిది ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్స్‌లో ఆభరణాలను విక్రయిస్తున్నాం. కేరళతోపాటు షార్జాలో సంస్థకు రెండు తయారీ కేంద్రాలున్నాయి. జోయాలుక్కాస్‌లో మొత్తం 8,000 పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

దక్షిణాది నుంచే అధికం.. 
దేశీయంగా కంపెనీ ఆదాయం 2014లో రూ.4,000 కోట్లుగా నమోదైంది. 2018–19లో టర్నోవరు రూ.8,100 కోట్లకు చేరింది. నాలుగేళ్లలోనే రెట్టింపు ఆదాయం నమోదు చేశామంటే బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్‌ అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచే 80 శాతం ఆదాయం సమకూరుతోంది. కంపెనీకి చెందిన అత్యధిక షోరూంలు ఉన్నది కూడా దక్షిణాదిలోనే. అందుకే ఇక్కడి మార్కెట్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశాం. రాష్ట్రాల వారీగా ప్రత్యేక డిజైన్లను పరిచయం చేస్తున్నాం.  

మార్కెట్‌ వజ్రాభరణాల వైపు.. 
భారత్‌లో క్రమంగా మార్కెట్‌ వజ్రాభరణాల వైపు మళ్లుతోంది. ఇప్పటికే లైట్‌ వెయిట్‌ జువెల్లరీకి డిమాండ్‌ ఊపందుకుంది. ఆభరణాల మార్కెట్‌ ఏటా 5 శాతం పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రజల వద్ద ఇప్పుడు ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నారైల ద్వారా డబ్బు వస్తోంది. ఐటీ రంగం కూడా జువెల్లరీ అమ్మకాలు అధికమయ్యేందుకు దోహదం చేస్తోంది. జోయాలుక్కాస్‌ భారత్‌లో ఏటా 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు సాగిస్తున్నాం. క్రమంగా ఈ విభాగం కూడా పెరుగుతోంది. న్యూయార్క్‌ కస్టమర్లకు త్వరలో ఆన్‌లైన్‌లో జువెల్లరీని అందుబాటులోకి తెస్తాం. 

ఈ ఏడాది మరో 14 కేంద్రాలు.. 
భారత్‌తోపాటు యూఎస్‌ఏ, యూఏఈ, యూకే, సింగపూర్, మలేషియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో విక్రయాలు సాగిస్తున్నాం. భారత్‌లో ఇప్పటికే 82 ఔట్‌లెట్లున్నాయి. ఈ ఏడాది మరో 5 ప్రారంభించనున్నాం. అలాగే అంతర్జాతీయంగా 64 షోరూంలు నడుస్తున్నాయి. కొత్తగా 9 ఏర్పాటు చేయనున్నాం. ఇందులో యూఎస్‌ఏలో మూడు సెంటర్లు వస్తాయి. తదుపరి విస్తరణలో భాగంగా శ్రీలంక, కెనడాలో అడుగు పెట్టాలన్న ప్రణాళికతో ఉన్నాం. నిలకడైన వృద్ధితో ఔట్‌లెట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాం. విస్తరణకు సొంత నిధులనే వెచ్చిస్తున్నాం. ఐపీవోకు వెళ్లే విషయమై 2021–22లో సమీక్షిస్తాం. అంతర్జాతీయ షోరూంల ద్వారా వార్షికంగా రూ.6,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement