కోటక్ మహీంద్రా – ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌లో భాగస్వామి వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనుంది.
డీల్ విలువ రూ.1,292 కోట్లు
ముంబై: కోటక్ మహీంద్రా – ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌లో భాగస్వామి వాటాను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ జేవీలో బ్రిటిష్ భాగస్వామి, ఓల్డ్ మ్యూచువల్‌కు ఉన్న 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు కోటక్ గ్రూప్ ప్రెసిడెంట్(అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్) గౌరంగ్ షా చెప్పారు. ఈ వాటా కొనుగోలుతో ఈ జేవీలో వంద శాతం వాటా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ డీల్ విలువ రూ.1,292 కోట్లు. డీల్ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఈ జేవీ రూ.300 కోట్ల నికర లాభం ఆర్జించిందని, గత నాలుగేళ్లలో లాభాలు ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందాయని గౌరంగ్ షా తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంస్థ నెట్‌వర్త్ రూ.1,825 కోట్లు. 1.50 కోట్ల మంది వినియోగదారులున్నారు. డీల్ వార్తల కారణంగా బీఎస్‌ఈలో కోటక్ బ్యాంక్ షేర్ 1.4% క్షీణించి రూ.901 వద్ద ముగిసింది.