‘‘నగరం అభివృద్ధిని గుర్తించేది స్థానికంగా ఉన్న సుందర, వినూత్న భవన ఆకారాలతోనే. లాస్ ఏంజిల్స్, షాంఘై వంటి నగరాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణమిదే. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కూడా గుర్తింపు పొందాలంటే స్థానిక డెవలపర్లు నాలుగు గోడలు, పైకప్పుతో డబ్బా లాంటి బిల్డింగ్స్ కట్టొద్దు. వినూత్న ఎలివేషన్స్, డిజైన్లతో నిర్మాణాలను చేపట్టాలని’’ తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. వినూత్న ఎలివేషన్స్ కోసం ఖర్చు పెట్టాలని.. ఆర్కిటెక్ట్, డిజైన్స్ ఎంపికలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో కలిసి పనిచేయాలన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ 9వ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు.
సాక్షి, హైదరాబాద్: డెవలపర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఆధునిక విధానాలను పాటించాలి. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించాలి. నిర్మాణ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి వంటివి రాకుండా చూసుకోవాలి. దీంతో అనారోగ్యంతో పాటూ కాలుష్యం ఎక్కువవుతుంది. మరీ ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో జరిగే నిర్మాణదారులు అప్రమత్తంగా ఉండాలి. వాటర్‌స్ప్రే వంటి ఎన్నో రకాల ఆధునిక విధానాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించడం, రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టరాదు. అనుమతులు ఇవ్వకుండానో, కూల్చడం ద్వారానో వీటిని ఆపొచ్చు. లేకపోతే ప్రభుత్వం జరిమానాలు, శిక్షలు విధించొచ్చు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సింది ఇది కాదని.. డెవలపర్లకే స్వీయ నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.
క్రెడాయ్ స్కిల్ ఇనిస్టిట్యూట్..
ప్రస్తుత నిర్మాణ రంగంలో పని చేస్తున్న కూలీలు ఎక్కువగా బిహార్, రాజస్తాన్ వంటి ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నారు. మనోళ్లేమో కూలీ పని కోసం గల్ఫ్ దేశాలకు పోతున్నారు. అలా కాకుండా నగర నిర్మాణ రంగంలో స్థానికులనే నియమించుకోవాలి. న్యాక్ వంటి సంస్థలతో నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేస్తాం. అవసరమైతే క్రెడాయ్ స్కిల్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతిపాదనలతో సంప్రదిస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ప్లంబర్, కార్పెంటర్ వంటి అన్ని రకాల నిర్మాణ రంగ పనులు స్థానికులకే అందిస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ప్రభుత్వం కూడా నిర్మాణ రంగ విధానాలను సులభతరం చేయడానికి ప్రధాన కారణం డెవలపర్లను చూసి కాదు.. నిర్మాణ రంగం మీద ఆధారపడి కూలీలు, తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు వంటి లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలకు న్యాయం జరుగుతుందనే.
డెవలపర్లు జిల్లాల్లోనూ దృష్టి సారించాలి..
హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ డెవలపర్లు దృష్టిసారించాలి. రూ.2,500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ టెక్నాలజీ పాలసీతో జనగాం, కామారెడ్డి, హుజూరాబాద్ వంటి ప్రాంతాల్లో బీపీఓ కేంద్రాలు రానున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా డెవలపర్లు ప్రాజెక్ట్‌లను చేపట్టాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటూ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ పెరగాలి. కాస్ట్ ఆఫ్ బిజినెస్ తగ్గాలని సూచించారు. అతిత్వరలోనే టీఎస్–బీపాస్ చట్టాన్ని అమలు చేయనున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. టీఎస్–ఐపాస్ తరహాలో దీన్నికూడా వంద శాతం సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డెవలపర్లు ఎంత సేపు ఇళ్లు కట్టడం, అమ్మడం మాత్రమే కాకుండా రాష్ట్రాభివృద్ధిలోనూ పాలు పంచుకోవాలి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కొత్తరకం ప్రాజెక్ట్‌లతో టూరిజం డెవలప్ అవుతుంది. దీంతో డెవలపర్లకే జీవిత కాలం ఆదాయం వస్తుందని’’ తెలిపారు. తెలంగాణలో ఉన్న క్రీడా మైదానాలు, కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వేదికలను డెవలపర్లు దత్తత లేదా నిర్వహణ చేయాలి. అవసరమైతే వాటికి వాళ్ల పేర్లే పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, జీవన్ రెడ్డిలతో పాటూ క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గుమ్మి రాంరెడ్డి, ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ – నాగోల్‌లో 20 లక్షల చ.అ.
పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్ నుంచి వస్తున్నవాళ్లే. అందుకే ఆయా కంపెనీలు ఉద్యోగులున్న చోటే పని ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే ఉప్పల్– నాగోల్ ప్రాంతంలో మూడు ప్రధాన కంపెనీలు 20 లక్షల చ.అ. కమర్షియల్ స్పేస్ అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే వాటికి అనుమతులు మంజూరు చేయనున్నాం. ఆయా ప్రాంతంలో ఐటీ, ఇతర కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు.
♦ డెవలపర్లు ఎంత సేపు పశ్చిమ హైదరాబాద్ మీదే దృష్టి పెడుతున్నారు. ఇది సరైంది కాదు. ఈస్ట్, నార్త్, సౌత్ జోన్స్‌లోనూ ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ఈస్ట్ జోన్ త్వరలోనే ఐటీ పార్క్, సౌత్ జోన్‌లో చైనీస్ కంపెనీతో కలిసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను, పేట్‌బషీరాబాద్ – కొంపల్లి వంటి నార్త్ జోన్‌లో ఐటీ పార్క్‌లను ప్రారంభించనున్నాం.
కో–లివింగ్‌కుమార్గదర్శకాలుఅవసరం..
ఈ మధ్య కాలంలో కో–లివింగ్‌కు డిమాండ్ పెరుగుతుంది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నగరంలో కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే ఈ కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఆయా కో–లివింగ్ ప్రాజెక్ట్‌లు ఫ్యామిలీ ప్రాజెక్ట్స్ ఉన్న చోట ఉంటే నివాసితులకు ఇబ్బంది. కో–లివింగ్‌లో ఉండేది యువతేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు ఎలాగైతే బల్క్ వాటర్‌ను అందిస్తున్నారో అలాగే నిర్మాణ రంగ అవసరాలకూ నీటిని అందించాలని కోరారు. రెసిడెన్షియల్ అసోసియేషన్స్‌కు ఫైర్ సేఫ్టీ, నిర్వహణ వంటి వాటిపై అగ్నిమాపక శాఖతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కల్పించాలని కోరారు. అవసరమైతే స్థానిక విద్యా సంస్థలు ప్రొఫెషనల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కోర్స్‌లను తీసుకురావాలని సూచించారు. క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ హైదరాబాద్‌లో మాత్రమే ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఉప్పల్, మేడ్చల్, కొంపల్లి వంటి తూర్పు, ఉత్తర హైదరాబాద్‌లోనూ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలి. దీంతో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాల వస్తాయి. సమాంతర అభివృద్ధి జరుగుతుంది. వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పార్క్‌ల ఏర్పాటుతో జిల్లాల్లోనూ రియల్టీ పరుగులు పెడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment