ఎల్ అండ్ టీ లాభం 1,435 కోట్లు
• 84 శాతం పెరుగుదల
• 8 శాతం వృద్ధితో రూ.25,011 కోట్లకు మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజ కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ..1,435 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.778 కోట్లు)తో పోల్చితే 84 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సాధారణ బీమా వ్యాపారాన్ని విక్రరుుంచామని, ఈ విక్రయ లావాదేవీలో వచ్చిన లాభాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థారుు నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ2లో రూ.23,123 కోట్లుగా ఉన్న ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 8 శాతం వృద్దితో రూ.25,011 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మొత్తం వ్యయాలు రూ.21,521 కోట్ల నుంచి రూ.23,173 కోట్లకు పెరిగాయని వివరించింది.అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా రూ.8,930 కోట్ల ఆదాయం ఆర్జించామని, మొత్తం ఆదాయంలో ఇది 36 శాతమని తెలిపింది. ఈ క్యూ2లో ఆర్డర్లు 11% పెరిగి రూ.31,119 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా రూ.7,386 కోట్ల(24%)ని వివరించింది. మౌలిక, హైడ్రో కార్బన్ రంగాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఆర్డర్ల విలువ 4 శాతం వృద్ధితో రూ.2,51,773 కోట్లకు పెరిగిందని వివరించింది.
భవిష్యత్తు ఆశాజనకమే...
మౌలిక రంగాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, రవాణా కారిడార్లు, మెట్రో రైల్వేలు, స్మార్ట్ సిటీలు, జల వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోందని ఎల్ అండ్ టీ పేర్కొంది. దేశీయంగా రక్షణ పరికరాల తయారీకి ప్రాధాన్యత పెరుగుతోందని, జీఎస్‌టీ, దివాలా కోడ్ బిల్లుల ఆమోదం కారణంగా చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయని వివరించింది. అంతర్జాతీయ పరంగా చూస్తే, తమ స్థారుుని పటిష్టం చేసుకుంటామని, కీలకమైన మౌలిక, ఇంధన రంగాల్లో వృద్ధి సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని వివరించింది.