గతవారం బిజినెస్ | last week bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Nov 16 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

last week bussiness

డిమాండ్ ఎగువకు..ధర దిగువకు..
భారత్‌లో పసిడి డిమాండ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగింది. ఈ పరిమాణాన్ని 268 టన్నులుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. త్రైమాసికం ప్రారంభంలో ధరలు తక్కువగా ఉండడం, పెళ్లిళ్లు, పండుగల సీజన్ డిమాండ్ పెరగడానికి కారణం. కాగా  పసిడి ధర ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి దిగింది. ఢిల్లీలో 10 గ్రాములకు 24, 22  క్యారెట్ల బంగారం ధరలు రూ.25,950, రూ.25,800 చొప్పున నమోదయ్యాయి.
 
ఎన్‌ఈసీ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు

నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్‌ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10% వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్‌ఈసీ-25 బ్లాక్ లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10%వాటాలు ఉన్నాయి.
 
ప్రపంచ వృద్ధి చోదకంగా భారత్
రానున్న కాలంలో భారత్ కూడా చైనాలా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా నిలువగలిగే సత్తా భారత్‌కు ఉందని, కానీ దీని కోసం ఇన్‌ఫ్రా లేమి, లింగ వివక్ష, విద్యుత్ కొరత వంటి ఇతరత్రా సవాళ్లను అధిగమించాల్సి ఉందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తెలిపింది.
 
ఫార్చ్యూన్ బిజినెస్ లీడర్ల జాబితాలో మనోళ్లు
బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఫ్రాన్సిస్ డి సౌజా, సత్య నాదెళ్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్‌కార్డ్ అజయ్ బంగా ఐదవ స్థానంలో, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16 వ స్థానంలో మైక్రోసాఫ్ట్ నాదెళ్ల 47వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో, ఫేస్‌బుక్ మార్క్ జుకరబర్గ్ రెండో స్థానంలో ఉన్నారు.
 
విమానాల్లో బ్యాగేజ్ బాదుడు
జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లు ప్రకటించేందుకు దేశీ విమానయాన సంస్థలకు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఒకవేళ ఇలాంటి ఆఫర్‌లో టికెట్ పొందినవారు ప్రయాణ సమయంలో చెకిన్ బ్యాగేజ్‌తో వచ్చిన పక్షంలో నిర్దేశిత చార్జీలు వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెకిన్ బ్యాగేజ్ ఉండని ప్రయాణికులకు.. డిస్కౌంట్లు ఇచ్చేలా జీరో బ్యాగేజ్ ఆఫర్లకు అనుమతించాలంటూ ఇండిగో, సై్పస్‌జెట్, ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థలు గతంలోనే కోరినప్పటికీ తిరస్కరించిన డీజీసీఏ తాజాగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
 
ఇంకా ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతంగా నమోదయ్యింది. ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
 
పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ!
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000  కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తామని ఎయిర్‌టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు.  బాండ్లు జారీ ఎప్పుడనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
 
ఆలీబాబా రికార్డ్ స్థాయి అమ్మకాలు
చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా బుధవారం రికార్డ్ స్థాయి ఆన్‌లైన్ అమ్మకాలు సాధించింది. ప్రతీ ఏడాది నవంబర్ 11న వచ్చే వార్షిక సింగిల్స్ డే సందర్భంగా 1,433 కోట్ల డాలర్ల ఆన్‌లైన్ అమ్మకాలు సాధించామని ఆలీబాబా తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధికంగా ఆన్‌లైన్ అమ్మకాలు సాధించిన రోజని పేర్కొంది. గత ఏడాది సింగిల్స్ డే అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 60% వృద్ధి సాధించామని తెలిపింది.
 
15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు
కేంద్రం.. పౌర విమానయానం, బ్యాంకింగ్, రిటైల్, న్యూస్ చానళ్లు తదితర 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్, ఐదు ప్లాంటేషన్ పంటల సాగులో 100% ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతించింది. ఇక న్యూస్, కరెంట్ అఫైర్స్ చానళ్లలో ఎఫ్‌డీఐ పరిమితిని 26% నుంచి 49%కి పెంచింది. రక్షణ, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది.
 
షేర్ల విభజనకు నాట్కో ఆమోదం
రూ. 10 ముఖ విలువ కలిగిన షేరును రూ.2గా విభజించడానికి నాట్కో కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి రికార్డు తేదీ నవంబర్ 28గా నిర్ణయించారు. నవంబర్ 28 నాటికి షేర్లు కలిగిన వాటాదారులకు ప్రతీ షేరుకు 5 షేర్లు వస్తాయి.
 
ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3 శాతం!

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ వృద్ధి రేటును 2015లో 7.3% గా అంచనా వేస్తోంది. 2016లో ఈ రేటు 7.5%గా ఉంటుందన్నది పేర్కొం ది. ఇదే జరిగితే ప్రపంచంలోనే వేగం గా అభివృద్ధి చెందుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమిస్తుం ది. 2015లో చైనా వృద్ధి రేటును 6.8%గా ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. 2016లో ఈ రేటు 6.3%గా ఉంటుందని పేర్కొంది.   
 
థామస్‌కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్
విదేశీ మారక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ.. భారత్‌లో తొలిసారి ‘ఫారిన్ ఎక్స్చేంజ్ యాప్’ను ప్రవేశపెట్టినట్టు థామస్‌కుక్ తెలిపింది. ఇందులో డాలర్, ఫ్రాంక్, యూరో తదితర ప్రధాన కరెన్సీల మారక విలువలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తామని పేర్కొంది. రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఈ యాప్‌లో ‘బ్లాక్ మై రేట్’ అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేశామని వివరించింది.
 
ఇండిగో.. లాభాల టేకాఫ్..
విమానయాన  సంస్థ ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ షేరు స్టాక్ మార్కెట్‌లో లాభాలతో లిస్టయింది. ఇష్యూ ధర రూ.765తో పోలిస్తే 12% లాభంతో రూ.856 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 17% వృద్ధితో రూ.898ని తాకిన ఈ షేరు చివరకు 15% లాభంతో రూ.878 వద్ద ముగిసిం ది. ఎన్‌ఎస్‌ఈలో 14.6% లాభంతో రూ.877 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement