పసిడిది వెనుకడుగే!
న్యూయార్క్/ముంబై: సమీప కాలంలో పసిడిది వెనుకడుగేనని నిపుణులు అంచనావేస్తున్నారు. సమీప భవిష్యత్తులో పసిడిపై పెట్టుబడుల పట్ల సంబంధిత ఇన్వెస్టర్లు పూర్తి నిరాశాజనకంగా ఉన్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నాయి ఫెడ్ రేటు పెంపు, హోల్డింగ్ వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో అమ్మకాలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. వారం వారీగా చూస్తే... న్యూయార్క్ కామెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా)కు వారం వారీగా దాదాపు 15 డాలర్లు పడిపోయి, 1,060 వద్ద ముగిసింది. వెండి కూడా 14.37 డాలర్ల నుంచి 13.80 డాలర్లకు పడింది.
దేశీయంగా ఇలా..
ఇక దేశీయంగా కూడా అంతర్జాతీయ బలహీన ధోరణే ప్రతిబింబిస్తోంది. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు శుక్రవారంతో ముగిసిన వారానికి రూ.180 తగ్గింది. రూ.25,015 వద్ద ముగిసింది. ఇక 99.9 ప్యూరిటీ ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.25,165 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.850 పడిపోయి రూ.33,610 వద్ద ముగిసింది.
ఆభరణాలు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు మందకొడిగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా తాజా సమీక్ష వారంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ పసిడి దిగుమతి టారిఫ్ రేట్లను 10 గ్రాములకు 347 డాలర్ల నుంచి 345 డాలర్లకు తగ్గించింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది.