
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఆదిభట్లలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) కేంద్రంలో లీప్ విమాన ఇంజిన్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ ముగింపులోగా తయారీ పూర్తయి విపణిలోకి విడుదల కానుంది. గతేడాది అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ), టీఏఎస్‌ఎల్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారమిక్కడ ఇరు కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) కేంద్రానికి భూమి పూజ చేశాయి.
ఈ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న జెట్, సీఎఫ్‌ఎం లీప్ ఇంజిన్లను అభివృద్ధి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రంలో జీఈ, టీఏఎస్‌ఎల్‌తో పాటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రధాన పెట్టుబడి వాటాదారుగా ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘దేశార్థికాభివృద్ధిలో తయారీ రంగం కీలకమైంది. అందులోనూ వైమానిక రంగంలో తయారీ అనేది అత్యంతకీలకమైందని.. అలాంటి కీలక కేంద్రం తెలంగాణలో ఉండటం రాష్ట్ర అభివృద్ధి సూచికని’’ వివరించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో టాటా ఒకటని.. ఇందులో జీఈ జత కట్టడం ముదావహమన్నారు. ‘గతంలో ఢిల్లీలో జీఈ సీఈఓ, చైర్మన్ జాన్ ఫ్లానెర్రీ కలిశానని.. వచ్చే ఐదేళ్ల వరకూ జీఈ ఆర్డర్ బుక్ ఫుల్‌గా ఉందని ఈ విషయాన్ని చెప్పారని’’ కేటీఆర్ గుర్తుచేశారు. వైమానిక రంగంలో నైపుణ్య శిక్షణ నిమిత్తం అకడమిక్స్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
భవిష్యత్తులో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లు..
జీఈకి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), సాంకేతికత కేంద్రాలున్నాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రంలో 700 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని జీఈ సౌత్ ఏషియా సీఈఓ, ప్రెసిడెంట్ విశాల్ వాన్‌చూ తెలిపారు. సాంకేతికత విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామన్నారు.
‘‘జీఈ మిలిటరీ ఇంజిన్లకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ వంటి రక్షణ విభాగానికి జెట్ ఇంజిన్స్, మెరైన్ గ్యాస్ టర్బైన్స్ అభివృద్ధి చేశాం. అలాగే భవిష్యత్తులో టీఏఎస్‌ఎల్ కేంద్రంలో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లను కూడా తయారు చేస్తామని’’ వాన్‌చూ వివరించారు.
ప్రస్తుతం ఎగుమతులకే..
జీఈ భాగస్వామ్యంతో దేశీయంగా తయారీ నైపుణ్యం మెరుగవ్వడంతో పాటూ అంతర్జాతీయ విమానయాన రంగంలో టాటా సామర్థ్యం మరింత వృద్ధి చెందుతుందని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ప్రెసిడెంట్ బాన్మాలీ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతానికైతే దేశీయం గా ఎలాంటి లీప్ ఇంజిన్ల అర్డర్లు లేవని, అభివృద్ధి చేస్తున్నవాటిని ఎగుమతి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
లీప్ ఇంజిన్లతో పాటు, ఇంజిన్‌లోని విడిభాగాలను కూడా తయారు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా లీప్ ఇంజిన్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి ఇంజిన్ల డిమాండ్ ఉందని.. 2020 నాటికి ఏటా 2 వేల ఇంజిన్లకు చేరుతుందని వాన్‌చూ తెలిపారు. సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ ఉత్పత్తే లీప్ ఇంజిన్. ఇది జీఈ, సాఫ్‌రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ 50:50 జాయింట్ వెంచర్. 18 నెలల్లో 5 దేశాలకు చెందిన 35 ఎయిర్‌లైన్స్‌కు 200 లీప్ ఇంజిన్లు అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment