
లెనొవొ నుంచి కే8 నోట్
ధర రూ. 12,999– రూ. 13,999
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనొవొ తాజాగా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ కే8 నోట్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 12,999 నుంచి రూ.13,999 దాకా ఉంటుందని పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఆగస్టు 18 నుంచి ఇది అందుబాటులో ఉంటుందని లెనొవొ ఇండియా ఎంబీజీ కంట్రీ హెడ్ సుధిన్ మాథుర్ తెలిపారు. మిగతా దేశాలన్నింటికన్నా ముందుగా భారత్‌లోనే ఈ ఫోన్‌ను ఆవిష్కరించినట్లు ఆయన వివరించారు. కె సిరీస్ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో ఇప్పటిదాకా 85 లక్షల పైచిలుకు విక్రయించినట్లు మాథుర్ వివరించారు. కె8 నోట్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ మెమరీ వెర్షన్ రేటు రూ. 12,999గాను, 4జీబీ ర్యామ్.. 64 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 13,999గాను ఉంటుంది. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 2.3 గిగాహెట్జ్ 10 కోర్ ప్రాసెసర్, 13 ఎంపీ+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు.