లెన్స్కార్ట్లోకి...రూ.400 కోట్లు
రతన్ టాటా, ఇన్ఫీ క్రిస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కళ్లజోళ్ల ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ లెన్స్‌కార్ట్ రూ.400 కోట్లు సమీకరించింది. ప్రపంచ బ్యాంక్ విభాగమైన ఐఎఫ్‌సీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, ఇన్పోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, తదితరుల నుంచి ఈ నిధులు సమీకరించామని లెన్స్‌కార్ట్ తెలిపింది. మూడేళ్లలో 400 నగరాలకు విస్తరించడానికి, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడానికి, కళ్లజోళ్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిధులు వినియోగిస్తామని లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ పియుష్ బన్సాల్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 5,000 లెన్స్‌లు తయారు చేస్తున్నామని, ఈ నిధులతో వచ్చే ఏడాది కల్ల ఈ సంఖ్యను 20,000కు పెంచుతామని పేర్కొన్నారు. ఈ రూ.400 కోట్ల సిరీస్ డి నిధుల్లో ఐఎఫ్‌సీ ప్రధాన ఇన్వెస్టర్ అని, టీపీజీ గ్రోత్, యాడ్‌వెక్ మేనేజ్‌మెంట్, ఐడీజీ వెంచర్స్ నుంచి కూడా నిధులు సమీకరించామని తెలిపారు. ఈ లావాదేవీకి అవెండాస్ క్యాపిటల్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిందని పేర్కొన్నారు.
త్వరలో వంద ‘టెక్నాలజీ’ ఉద్యోగాలు...
2010లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటివరకు రూ.317 కోట్ల పెట్టుబడులు రాబ ట్టింది. ఐడీజీ వెంచర్స్, రోనీ స్క్రూవాలకు చెందిన యునిలేజర్ వెంచర్స్, టీపీజీ గ్రోత్, టీఆర్ క్యాపిటల్ సంస్థ నుంచి పెట్టుబడులను సమీకరించింది. టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను పటిష్టం చేయనున్నామని వచ్చే ఏడాది కల్లా టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల సంఖ్యను వంద నుంచి 200కు పెంచనున్నామని బన్సాల్ వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో మొత్తం 400 మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.