జీవిత బీమా కంపెనీలకు... కొత్త పాలసీల జోరు
జూలైలో రూ.13,854 కోట్ల నూతన ప్రీమియం..
రూ.10,737 కోట్లతో ఎల్‌ఐసీ అగ్ర వాటా
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీ ప్రీమియంల ఆదాయం జూలైలో 4 శాతం పెరిగి రూ.13,854కోట్లు వసూలు అయింది. గతేడాది జూలైలో నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.13,319 కోట్లుగా ఉంది. కొత్త పాలసీల్లో అగ్ర వాటా ఎప్పటిలాగే ప్రభుత్వరంగ ఎల్‌ఐసీకే దక్కింది. ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం 3 శాతం పెరిగి రూ.10,737కోట్లకు చేరుకుంది. మిగిలిన 23 జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార (నూతన పాలసీలు) ఆదాయం 7.5 శాతం వృద్ధి చెంది రూ.3,116 కోట్లకు చేరుకుంది. గతేడాది జూలైలో వీటి ఆదాయం రూ.2,898 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం...
{Oపెవేటు రంగ బీమా కంపెనీల్లో ఎస్‌బీఐ లైఫ్ అధిక వృద్ధి కనబరిచింది. నూతన పాలసీల ద్వారా రూ.676 కోట్ల ఆదాయాన్ని గడించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.497 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం 17 శాతం వృద్ధి చెంది రూ.521 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఆదాయం రూ.445 కోట్లు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన పాలసీల వ్యాపారం సైతం 16.5 శాతం వృద్ధి చెంది రూ.565 కోట్లకు చేరుకుంది.
ఈ కంపెనీల ఆదాయం తగ్గింది
జూలై నెలలో నూతన పాలసీల ద్వారా ఆదాయం కోల్పోయిన వాటిల్లో కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ, అవివా లైఫ్, రెలియన్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ ఆదాయం సగానికి పడిపోయి రూ.62 కోట్లకు పరిమితం అయింది.